64 విల్లాల కొనుగోలు కేసు.. రాజస్థాన్ ఐఏఎస్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

64 విల్లాల కొనుగోలు కేసు.. రాజస్థాన్ ఐఏఎస్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ
  • రెండున్నరేండ్లలో 64 విల్లాలు కొనుగోలు చేసిన ఐఏఎస్
  • ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు.. 
  • దర్యాఫ్తు జరుపుతున్న అధికారులు

జైపూర్: విల్లాల కొనుగోలు విషయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణ నుంచి రక్షణ కల్పించాలంటూ రాజస్థాన్‌‌‌‌ సీనియర్ ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను ఆ రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చింది. గోయల్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని ‘అనంత రిసార్ట్స్’ నుంచి అగర్వాల్ కుటుంబ సభ్యులు అతి తక్కువ ధరకు 64 విల్లాలు, కాటేజీలను కొనుగోలు చేశారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ విల్లాలను అగర్వాల్, ఆయన భార్య ఐపీఎస్ అధికారిణి ప్రశాఖ మాథుర్, ఇద్దరు కుమారులు మరియు ఇతర కుటుంబ సభ్యుల పేర్లపై కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఈ పిటిషన్‌‌‌‌పై విచారణ జరిపిన జస్టిస్ అనిల్ కుమార్ ఉప్మాన్ ఏకసభ్య ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, సమాధానం ఇచ్చేందుకు మూడు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది. అగర్వాల్‌‌‌‌ను ఈ కేసులో ఇరికిస్తున్నారని, ప్రాథమిక విచారణతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు వంటి చర్యల నుంచి రక్షణ కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. మధ్యంతర రక్షణ ఇచ్చే ముందు ప్రభుత్వం వాదనలు వినాల్సి ఉందన్న కోర్టు, ఏసీబీ దర్యాప్తు నిలిపివేసేందుకు నిరాకరించింది. అయితే, ఏసీబీ ఇప్పటికే బుధవారం అగర్వాల్‌‌‌‌తో పాటు గోయల్ ఫ్యాషన్స్ డైరెక్టర్లు ముకుంద్ సరన్ గోయల్, సంజయ్ గోయల్‌‌‌‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 

విల్లాలు కొన్న సంస్థకే లీజుకు ఇచ్చి అద్దె వసూలు..

ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కొన్ని వారాల ముందు, శిఖర్ అగర్వాల్ కుమారులు జైపూర్‌‌‌‌లోని అనంత రిసార్ట్‌‌‌‌లో 24 విల్లాలను కేవలం రూ.2.64 కోట్లకే కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. రిసార్ట్ బ్రోచర్‌‌‌‌‌‌‌‌లో ఈ విల్లాల ధర రూ.59 లక్షలుగా ఉండగా, అగర్వాల్ కుటుంబం ఒక్కో విల్లాను కేవలం రూ.11 లక్షలకే కొనుగోలు చేసినట్లు ఎఫ్ఐఆర్‌‌‌‌లో పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో అగర్వాల్ కుటుంబం మొత్తం 64 విల్లాలు, కాటేజీలను కొనుగోలు చేసింది. 

విల్లాలను కొనుగోలు చేసిన గోయల్ ఫ్యాషన్స్ సంస్థకు శాశ్వత లీజుకు ఇచ్చి, దాని ద్వారా వచ్చే అద్దెను యజమానులకు అందజేస్తోంది. కాగా, 2006 నుంచి 2026 మధ్య ఉదయ్‌‌‌‌పూర్ కలెక్టర్‌‌‌‌గా, రాజస్థాన్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌‌‌‌గా, పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సమయంలో అగర్వాల్ తన అధికారిక హోదాను దుర్వినియోగం చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన రూల్స్​ సడలించారని, భూ మార్పిడి పత్రాలు, అటవీ శాఖ ఎన్‌‌‌‌వోసీల నిబంధనలను తొలగించారని పేర్కొంది. సరిస్కా టైగర్ రిజర్వ్ సమీపంలోని రిసార్ట్‌‌‌‌లకు లబ్ధి చేకూర్చేందుకే ఈ మార్పులు చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది.