ఆగిన హ్యామ్ రోడ్లు.. లోన్లు ఇచ్చేందుకు ముందుకు రాని బ్యాంకర్లు

ఆగిన హ్యామ్ రోడ్లు.. లోన్లు ఇచ్చేందుకు ముందుకు రాని బ్యాంకర్లు
  • మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వని సర్కారు
  • పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లు
  • రెండేళ్లుగా ఎదురుచూపులే
  • హ్యామ్ పేరుతో రోడ్లకు రిపేర్లు చేయని ఆఫీసర్లు
  • ఇబ్బందుల్లో వాహనదారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రహదారుల రూపురేఖలు మారుస్తామంటూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హ్యామ్ రోడ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. పనులకు శంకుస్థాపన చేసి నాలుగు నెలలు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు కిలో మీటరు రోడ్డు పని కూడా ప్రారంభం కాలేదు. కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీలకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గారనే ప్రచారం జరుగుతోంది. హ్యామ్ జాబితాలో ఉన్నాయనే కారణంతో పాత రోడ్లకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. 

లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్ల విముఖత..

హ్యామ్​ రోడ్ల ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో అమలు కావాలంటే బ్యాంకర్లు ఇచ్చే 60 శాతం రుణాలే కీలకం. కానీ కాంట్రాక్టు దక్కించుకున్న ఏజేన్సీలు లోన్ల కోసం బ్యాంకులను సంప్రదిస్తే ఎటూ తేల్చడంలేదు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పెద్ద, పెద్ద ప్రాజెక్టుల కోసం హ్యామ్ ప్రాజెక్ట్​లు అమలుచేస్తుండగా, రాష్ట్రంలో అందుకు భిన్నంగా చిన్న, చిన్న రోడ్ల నిర్మాణం, రిపేర్లను సైతం ఈ ప్రాజెక్టు కింద చేర్చారు. దీంతో ప్యాకేజీల వారీగా డీపీఆర్లను పరిశీలిస్తున్న బ్యాంకర్లు ఆ పత్రాలను చూసి పెదవి విరుస్తున్నట్లు ప్రచారం.

బ్యాంకుల నుంచి ప్యాకేజీల వారీగా లోన్లు మంజూరు పత్రాలు అందితేనే ఆఫీసర్లు కాంట్రాక్టు సంస్థలకు ‘అపాయింటెడ్ డేట్’ ఆర్డర్లు జారీ చేసే అవకాశం ఉంది. అప్పుడే చట్ట ప్రకారం కాంట్రాక్టు ఏజెన్సీలకు ప్రభుత్వం అడ్వాన్స్​గా చెల్లించే 10 శాతం నిధులతో పాటు 18 నెలల వర్క్ పీరియడ్​లో చెల్లించాల్సిన 30 శాతం ప్రభుత్వ నిధులు, 60 శాతం బ్యాంకులు ఇచ్చిన లోన్ల మొత్తం కలిపి బిల్లుల మంజూరుకు వీలవుతుంది.

ఆ తర్వాత 15 ఏళ్ల పాటు నిర్వహించే రోడ్డు మెయింటనెన్స్​ను బట్టి బ్యాంకు నుంచి ఏజెన్సీలు పొందిన 60 శాతం లోన్ మొత్తాన్ని ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో బ్యాంకుల్లో జమచేయాల్సి ఉంటుంది. కానీ, కాంట్రాక్టర్లు తమ వాటాగా సమకూర్చుకోవాల్సిన 60 శాతం నిధుల కోసం బ్యాంకు లోన్లు, ఎస్క్రో ఖాతాల ప్రక్రియ అపాయింటెడ్ డేట్ అగ్రిమెంట్లపై సంతకాలు జరిగితే తప్ప పనులు పట్టాలెక్కే పరిస్థితి లేదు.

అడ్వాన్సులు లేక కాంట్రాక్టర్ల వెనుకడుగు..

రాష్ట్రంలో 32 జిల్లాల పరిధిలో ఆర్అండ్ బీ శాఖ తరఫున రూ.13,006 కోట్లతో 441 రోడ్ల అభివృద్ధికి 34 ప్యాకేజీలు, పంచాయతీ రాజ్ శాఖ తరపున రూ.6,294.81 కోట్లతో 7,449.50 కి.మీ మేర చేపట్టాల్సిన 2,162 రోడ్ల పనులను 17 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఫైనల్ చేశారు. మొత్తం రెండు శాఖల తరఫున ఒకేసారి రూ.19,300 కోట్లతో పనులు చేపట్టేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. జూన్ 27న సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

రెండేళ్ల తర్వాత గ్రామీణ రోడ్లతో పాటు సింగిల్, డబుల్ లైన్ రోడ్లు, జిల్లా కేంద్రాలను కలిపే నాలుగు వరుసల రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని తెలిసి రాష్ట్ర ప్రజలు సంబురపడ్డారు. కానీ, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి 'మొబి లైజేషన్ అడ్వాన్సులు’ ఇప్పటివరకు అందకపోవడం కూడా పనులు ప్రారంభం కాకపోవడానికి మరో కారణంగా తెలుస్తోంది. ముందస్తు నిధులు లేకుండా సొంత డబ్బుతో పనులు మొదలుపెట్టలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తుండగా, ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం సమీక్షలకే పరిమితమవుతున్నారు.  

కొత్త రోడ్లు రావు.. పాత రోడ్లు బాగుచేయరు!

ప్రభుత్వం, కాంట్రాక్టర్ల మధ్య సాగుతున్న సాంకేతిక, ఆర్థిక ప్రక్రియల జాప్యం వాహనదారులకు శాపంగా మారింది. ఈ రహదారులన్నీ హ్యామ్ ప్రాజెక్టు కింద కొత్తగా నిర్మిస్తామనే కారణంతో, ఆఫీసర్లు వాటిపై కనీసం గుంతలు పూడ్చే (ప్యాచ్ వర్క్) పనులు కూడా చేపట్టడం లేదు. ఇటీవల వర్షాలకు గ్రామీణ, మండలస్థాయి రోడ్లు పూర్తిగా ధ్వంసమై అడుగుకో గుంతతో అధ్వానంగా మారాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతుండటం, వాహనాలు దెబ్బతినడం, అత్యవసర సమయాల్లో అంబులెన్సులు సైతం సకాలంలో గమ్యస్థానాలకు చేరలేకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడానికి ఆర్అండ్ బీ శాఖ 2024లో సుమారు రూ.1,200 కోట్లు, 2025లో రూ.890 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. హ్యామ్ ప్రాజెక్ట్ కారణంగా ఈ నిధులు మంజూరు కాలేదు. ప్రభుత్వం పర్మినెంట్​గా రోడ్లను బాగు చేయలేదు. ఈ క్రమంలో వచ్చే సంక్రాంతి నాటికైనా పనులు మొదలవుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.