వెలుగు స్పెషల్ : ఇంటర్‌‌‌‌‌‌‌‌ విలీనం..ప్రభుత్వ విద్యకు కొత్త దిశ 

వెలుగు స్పెషల్ : ఇంటర్‌‌‌‌‌‌‌‌ విలీనం..ప్రభుత్వ విద్యకు కొత్త దిశ 

విద్య మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కొనుగోలు చేసే వస్తువు కాదు.  ప్రతి బిడ్డకు సమానంగా అందాల్సిన సామాజిక హక్కు.  కానీ  నేటి విద్యా వ్యవస్థలో ఆర్థిక స్థోమతే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తున్నది. డబ్బున్న కుటుంబాల పిల్లలకు కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ సంస్థల్లో మెరుగైన సదుపాయాలు, ప్రత్యేక శిక్షణ లభిస్తుంటే.. మిగిలిన కుటుంబాలు నాణ్యమైన విద్య కోసం ఆదాయంలో అధిక భాగాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ అసమానతలను తగ్గించడమే నిజమైన విద్యా సంస్కరణ. ఈ దిశగా ఇంటర్మీడియట్‌‌‌‌‌‌‌‌ను పాఠశాల విద్యలో విలీనం చేసి, పన్నెండో తరగతి వరకు సమగ్ర విద్యా విధానాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం సంకల్పించడం కీలకమైన ముందడుగు.దేశంలో చాలాచోట్ల పన్నెండో తరగతి వరకు పాఠశాల విద్యలో భాగంగానే కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌, తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాల్లో ప్రత్యేక ఇంటర్‌‌‌‌‌‌‌‌ లేదా ప్రీ-యూనివర్సిటీ వ్యవస్థ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లలో జూనియర్‌‌‌‌‌‌‌‌ కళాశాలల వ్యవస్థ కాలక్రమంలో కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ సంస్థల విస్తరణకు ప్రత్యేక మార్కెట్‌‌‌‌‌‌‌‌గా మారింది. 

ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు నీట్‌‌‌‌‌‌‌‌, జేఈఈ శిక్షణ కలిపి ఇస్తామనే పేరుతో అధిక ఫీజులు వసూలు చేసే ధోరణి పెరిగింది. కళాశాల ఫీజులు, కోచింగ్‌‌‌‌‌‌‌‌, హాస్టల్‌‌‌‌‌‌‌‌, రవాణా, పుస్తకాల కోసం తల్లిదండ్రులు పెద్ద మొత్తాలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ చదివించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు విద్యార్థులపై మార్కులు, ర్యాంకులు, పోటీ పరీక్షల ఒత్తిడి పెరుగుతోంది. ర్యాంకుల సాధనకే పరిమితమవుతున్న సంస్థలు ఎక్కువయ్యాయి.

ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌బీ లెక్కల ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా 13,892 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలన్నింటికీ విద్యా ఒత్తిడి ఒక్కటే కారణం కాదు. కుటుంబ, ఆర్థిక, సామాజిక, మానసిక ఆరోగ్య సమస్యలూ ప్రభావం చూపుతాయి. అయినా విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ, కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యను వ్యాపార ధోరణుల నుంచి బయటకు తీసుకొచ్చి,  ప్రభుత్వ విద్యను బలమైన ప్రత్యామ్నాయంగా నిలపడం ఈ సంస్కరణ లక్ష్యం. పాఠశాలలోనే పన్నెండో తరగతి వరకు నాణ్యమైన బోధన అందుబాటులోకి వస్తే,  ప్రత్యేక కళాశాలలపై కుటుంబాల ఆధారపడటం తగ్గే అవకాశం ఉంది.

గ్రామీణ విద్యార్థులకు కొత్త భరోసా

నవంబర్‌‌‌‌‌‌‌‌ 11న విద్యాశాఖపై జరిగిన సమీక్షలో 2027–28 విద్యా సంవత్సరం నుంచి పన్నెండో తరగతి వరకు సమగ్ర విద్యా విధానం అమలుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు సీనియర్‌‌‌‌‌‌‌‌ సెకండరీ విభాగంగా కొనసాగించే ప్రతిపాదన ఉంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పన్నెండో తరగతి వరకు విద్య అందుబాటులో ఉండటాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. పదో తరగతి తర్వాత ప్రత్యేక కళాశాలల్లో చేరలేక చాలామంది చదువు మానేస్తున్న పరిస్థితిని కూడా సీఎం గుర్తించారు. తెలంగాణ విద్యా కమిషన్‌‌‌‌‌‌‌‌ సైతం 11, 12 తరగతులను పాఠశాల విద్యలో భాగం చేయాలని సిఫార్సు చేసింది. జూనియర్‌‌‌‌‌‌‌‌ కళాశాలల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, పదవీ విరమణ ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ మార్పువల్ల అత్యధిక ప్రయోజనం గ్రామీణ విద్యా ర్థులకు కలుగుతుంది. ఇప్పుడు పదో తరగతి తర్వాత ఇంటర్‌‌‌‌‌‌‌‌ కోసం మరో కళాశాలలో చేరాల్సి వస్తోంది. గ్రామాల దగ్గర జూనియర్‌‌‌‌‌‌‌‌ కళాశాలలు లేకపోతే దూరప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉంది. ఈ ప్రయాణ, ఫీజు, పుస్తకాల, వసతి ఖర్చులు పేద కుటుంబాలకు భారమై, ప్రతిభ ఉన్నా కొందరు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ముఖ్యంగా బాలికలకు ప్రయాణ భద్రత, దూరప్రాంతాల్లో చదువు అదనపు సమస్యలు. పాఠశాలలోనే పన్నెండో తరగతి వరకు చదివే అవకాశం ఉంటే ఈ అడ్డంకులు తగ్గే అవకాశం ఉంది.  చదువు మధ్యలో మానేసేవారి సంఖ్య తగ్గి, ఉన్నత విద్యవైపు వెళ్లేవారు పెరుగుతారు.

యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా పాఠశాలలతో సమగ్ర విద్యా నిర్మాణం

ఇంటర్‌‌‌‌‌‌‌‌ విలీనం విజయవంతం కావాలంటే పాఠశాలల్లో  మౌలిక సదుపాయాల బలోపేతం కీలకం. ఇందులో యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌ స్కూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రధాన పాత్ర  పోషించనున్నాయి. 2026–27 బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో వీటికి రూ.5,000 కోట్లు కేటాయించడం, 105 పాఠశాలల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోవడం ప్రభుత్వ ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది.  ఈ పాఠశాలలను భవనాలు, వసతి గృహాలకే పరిమితం చేయకుండా నాణ్యమైన బోధన, ఆధునిక ప్రయోగశాలలు,  గ్రంథాలయాలు, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ విద్య,  క్రీడలు, భాషా నైపుణ్యాలు, వృత్తి విద్య అందించే సమగ్ర కేంద్రాలుగా తీర్చిదిద్దడం లక్ష్యం. తెలంగాణ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ స్కూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రీప్రైమరీ నుంచి పన్నెండో తరగతి వరకు నిరంతర విద్య అందించే నమూనాలుగా రూపుదిద్దుకోనున్నాయి.  యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా పాఠశాలలు,  తెలంగాణ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ స్కూల్స్‌‌‌‌‌‌‌‌, ప్రస్తుత ప్రభుత్వ ఉన్నత పాఠశాలల అభివృద్ధి, ఇంటర్‌‌‌‌‌‌‌‌ విలీనం పరస్పరం అనుసంధానమైన ప్రణాళికలో భాగంగా ఉండటం అవసరం. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య, పాఠశాలల సామర్థ్యం, అదనపు తరగతి గదుల అవసరం ఆధారంగా ప్రణాళిక రూపొందే అవకాశం ఉంది. 

 నాణ్యమైన బోధనకు పునాది

పాఠశాలలకు మరో రెండు తరగతులు చేరడంతో బోధన అవసరాలు పెరుగుతాయి. గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు, ఆంగ్లం, ఇతర భాషల బోధనకు ప్రత్యేక నైపుణ్యం కావాలి. ఇప్పటికే కొరత ఉన్న పాఠశాలల్లో అదనపు తరగతులు బోధనపై ఒత్తిడి పెంచే అవకాశం ఉన్నందున, సబ్జెక్టులవారీ అవసరాల అంచనా, దశలవారీ నియామకాలు ప్రణాళికలో భాగంగా ఉండటం కీలకం.  జూనియర్‌‌‌‌‌‌‌‌ కళాశాలల అధ్యాపకుల అనుభవాన్ని కొత్త విధానంలో వినియోగించుకునే అవకాశం ఉంది. ఇంటర్‌‌‌‌‌‌‌‌ స్థాయిలో నీట్‌‌‌‌‌‌‌‌, జేఈఈ వంటి పరీక్షలకు అవసరమైన బోధన, ప్రయోగాత్మక శిక్షణ, మార్గదర్శకత్వం ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా గ్రామీణ విద్యార్థులకూ అందాలన్నది సంస్కరణ లక్ష్యం.  కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌, ఒత్తిడి నిర్వహణ, క్రీడలు, కళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఈ ప్రణాళికలో భాగం కావడం అవసరం.

విద్యా బడ్జెట్‌‌‌‌‌‌‌‌ – సంస్కరణలకు ఆర్థిక బలం

2026–27 బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో విద్యారంగానికి రూ.26,674 కోట్లు కేటాయించారు. మొత్తం రూ.3,24,234 కోట్ల బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ఇది సుమారు 8.22 శాతం. గత ఏడాది ఇది 7.58 శాతం. కేటాయింపు పెరగడం స్వాగతించదగిన పరిణామం. విద్యా బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను క్రమంగా 15 శాతానికి పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ విద్యా కమిషన్‌‌‌‌‌‌‌‌ 18 శాతం కేటాయింపును సిఫార్సు చేసిన నేపథ్యంలో.. భవిష్యత్తులో విద్యారంగానికి మరిన్ని నిధులు సమకూరే అవకాశం ఉంది.  ఉన్నత విద్యకు కూడా ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ప్రాధాన్యం దక్కింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్లు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రూ.400 కోట్లు కేటాయించారు. విద్యార్థుల పోషకాహారం కోసం అల్పాహార పథకం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్‌‌‌‌‌‌‌‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి చర్యలు విద్యార్థుల ఆరోగ్యం, హాజరు, అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచగలవు. 57 పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌ కళాశాలలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా, ఐటీఐలను ఆధునిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దడం వృత్తి విద్యకు కొత్త అవకాశాలు కల్పిస్తుంది. పన్నెండో తరగతి పూర్తయ్యేనాటికి ఉన్నత విద్య, వృత్తి విద్య, ఉపాధి నైపుణ్యాలపై సరైన మార్గదర్శకత్వం అందడం ఈ సంస్కరణకు పూర్తి సార్థకత చేకూరుస్తుంది.

సమాన విద్యావకాశాలే లక్ష్యం

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ విద్యా సంస్కరణల ప్రధాన లక్ష్యం నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికి అందుబాటులోకి తీసుకురావడం. ఆర్థిక స్థోమత, కులం, మతం, నివాస ప్రాంతం కారణంగా ఏ విద్యార్థీ విద్యకు దూరం కాకూడదన్న సామాజిక న్యాయ దృక్పథమే ఈ సంస్కరణకు పునాది. అంతిమంగా ఈ సంస్కరణ విజయాన్ని ఇంటర్‌‌‌‌‌‌‌‌ బోర్డు విలీనంతో మాత్రమే కొలవలేం. పేద కుటుంబానికి చెందిన విద్యార్థి కూడా ధనిక కుటుంబ విద్యార్థికి దక్కేస్థాయిలో నాణ్యమైన విద్యను  ప్రభుత్వ పాఠశాలలో పొందగలగడం, గ్రామీణ బాలిక భద్రతతో, ఆర్థిక ఇబ్బందులు లేకుండా పన్నెండో తరగతి వరకు చదువుకోగలగడం, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం పెరగడం అసలైన కొలమానాలు. ఈ లక్ష్యాలు కార్యరూపం దాల్చినప్పుడు ఇంటర్‌‌‌‌‌‌‌‌ విలీనం విద్యార్థులకు నిజమైన వరంగా, తెలంగాణ విద్యా చరిత్రలో గుణాత్మక పరివర్తనకు పునాదిగా నిలుస్తుంది. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- చనగాని దయాకర్‌‌‌‌‌‌‌‌
టీపీసీసీ జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ