హైదరాబాద్ సిటీ, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డుపై పచ్చదనం నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏ ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్‌పై స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. తొలిదశలో 119 నుంచి 121 కిలోమీటర్ల మధ్య ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. రోడ్డుకు రెండు వైపులా ఉన్న మొక్కలు, గ్రీన్‌బెల్టులు, పచ్చదనం ప్రాంతాలకు స్ప్రింక్లర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం మొక్కలకు నీరు పట్టేందుకు ట్యాంకర్లను వాడుతున్నారు.
వీటి రాకపోకలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. స్ప్రింకర్ల వల్ల నీటి వినియోగం సమర్థవంతంగా జరగడంతో పాటు సిబ్బంది, నిర్వహణ ఖర్చులు కూడా తగ్గనున్నాయి. దీని పనితీరును 10 రోజుల పాటు పరిశీలించనున్నారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉంటే ఓఆర్‌ఆర్‌లోని ఇతర ప్రాంతాలకూ దశలవారీగా విస్తరించాలని హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నిర్ణయించింది.
