- కొందరు మంత్రులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు
- అహంకారంతో మాట్లాడడం మాని మంచి పాలన అందించాలని హితవు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని దొంగలకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టవద్దని మంత్రులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు పేదల సంక్షేమం, వారి అభివృద్ధి విషయంలో న్యాయంగా, నిజాయితీగా పనిచేయాలని సూచించారు.
పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం కాంగ్రెస్ మంత్రులైనా నిజాయితీగా పాలన చేయాలని కోరారు. ప్రభుత్వానికి ఆ మంచి బుద్ధిని ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నానని అన్నారు. అహంకారంతో మాట్లాడడం, ప్రతిపక్షాలపై విరుచుకుపడడం కాకుండా మంచి పాలన చేస్తే ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారని చెప్పారు.
‘ప్రజలకు మీరిచ్చిన హామీలేంటి? ఇప్పుడు చేస్తున్నందేటి? నిజాయితీగా, అవినీతి లేకుండా పాలన చేస్తున్నారా.. లేదా.. అనేది ఒకసారి గుండెల మీద చేయివేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి’ అని కొందరు మంత్రులకు ఆయన సూచించారు.
