హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానం ఖాళీగా ఉన్నందున ఉప ఎన్నిక నిర్వహణకు చర్యలు చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌లో ఆయన ఈ మధ్యంతర పిటిషన్ వేశారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేసి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని విజయారెడ్డి పిటిషన్‌లో కోరారు. ఈ మధ్యంతర పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. చింతల తరఫున న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిందని, దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తదుపరి విచారణ అవసరం లేదని, దాన్ని కొట్టివేయాలని కోరారు. ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజాప్రాతినిధ్యం కల్పించేందుకు ఉప ఎన్నిక నిర్వహణకు చర్యలు తీసుకునేలా ఈసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న హైకోర్టు, ప్రధాన ఎన్నికల పిటిషనర్, పి.విజయారెడ్డికి నోటీసులు జారీ చేసింది. మధ్యంతర పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
