గాంధీ రోగులు..టిమ్స్ కా?..ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం..గాంధీ వైద్య విద్యార్థుల ఆందోళన

గాంధీ రోగులు..టిమ్స్ కా?..ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం..గాంధీ వైద్య విద్యార్థుల ఆందోళన
  •     వెయిటింగ్ లిస్ట్ పేషెంట్లు మాత్రమే  
  •     సూపరింటెండెంట్​ఉషారాణి

పద్మారావు నగర్, వెలుగు : గాంధీ దవాఖానలో చేరుతున్న రోగులను సనత్‌‌నగర్‌‌లోని టిమ్స్ కు తరలించి అక్కడ ట్రీట్​మెంట్ చేయించాలంటూ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలు ఇచ్చారని  గాంధీ వైద్య విద్యార్థులు ఆరోపించారు.  దీనికి నిరసనగా జూనియర్ ​డాక్టర్లు, పీజీ విద్యార్థులు గాంధీ మెయిన్ బిల్డింగ్ వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు.రాష్ట్ర జూనియర్​ డాక్టర్ల అసోసియేషన్ లీడర్​ డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ గాంధీలో అడ్మిట్ అయిన రోగులను ఇక్కడి డాక్టర్లు, పీజీ విద్యార్థులే స్వయంగా టిమ్స్​కు తీసుకెళ్లి అక్కడ చికిత్స చేసి తీసుకురావాలన్న నిబంధనను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అనుకుంటే గాంధీలోనే మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  

అది నిజం కాదు : సూపరింటెండెంట్ 

జూనియర్ డాక్టర్ల ఆరోపణలను గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తోసిపుచ్చారు. సనత్‌‌నగర్‌‌లోని టిమ్స్ లేటెస్ట్​ ఆపరేషన్ థియేటర్లతో కూడిన హై-ఎండ్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన అని, అక్కడ అత్యాధునిక వసతులున్నాయని చెప్పారు. గాంధీలో సర్జరీల కోసం వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో, ఆ భారాన్ని తగ్గించి రోగులకు సత్వర చికిత్స అందించేందుకు వీలుగా టిమ్స్​లో కేవలం ఒక ఆపరేషన్ థియేటర్‌‌ను మాత్రమే గాంధీ దవాఖానకు కేటాయించారని స్పష్టతనిచ్చారు.