- తొమ్మిదేళ్ల నిరీక్షణకు ఫలితం
- 32 వారాలకే ప్రసవమైనా..ప్రాణాలు కాపాడిన డాక్టర్లు
- ఐవీఎఫ్లో వరుస విజయాలు
పద్మారావు నగర్, వెలుగు : గాంధీ దవాఖాన డాక్టర్లు మరోసారి ప్రతిభ చాటారు. సంతానం కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఓ మహిళకు ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చేశారు. 32 ఏళ్ల అవంతికి ఒక్కరు..కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పిల్లలు పుట్టడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, 32 వారాలకే జన్మించిన ఆ పిల్లలకు అత్యవసర వైద్య సేవలందించి క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు. గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ఉషారాణి శుక్రవారం వివరాలు వెల్లడించారు.
రెండో సైకిల్‌లోనే గర్భధారణ
పెండ్లయి తొమ్మిదేళ్లు గడిచినా సంతానం కలగకపోవడంతో వనపర్తికి చెందిన ఈశ్వర్, అవంతి దంపతులు ఓ ప్రైవేటు దవాఖానలో మల్టిపుల్ ఓవులేషన్ ఇండక్షన్, ఐయూఐ వంటి ఖరీదైన చికిత్స చేయించుకున్నారు. అయినా, ఫలితం దక్కకపోవడంతో 2026 జనవరిలో గాంధీ ఐవీఎఫ్ కేంద్రాన్ని ఆశ్రయించారు. ఇక్కడి డాక్టర్లు అన్ని పరీక్షలు నిర్వహించి, ఓవులేషన్ ఇండక్షన్‌తో పాటు నిర్ణీత టైంలో దాంపత్య జీవనం పద్ధతిలో చికిత్స అందించారు. డాక్టర్ల అంచనాలు ఫలించి రెండో సైకిల్‌లోనే అవంతి గర్భం దాల్చారు. స్కానింగ్ చేయగా..గర్భంలో ముగ్గురు శిశువులున్నట్లు తేలింది.
సవాళ్లను అధిగమించి..
గర్భంలో ముగ్గురు శిశువులుండటం, దీనికి తోడు గర్భాశయ ముఖద్వారం చిన్నదిగా ఉండటంతో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు గుర్తించారు. అప్రమత్తమై గర్భధారణ 14వ వారంలో ‘మెక్‌డొనాల్డ్స్ సర్వికల్ సర్క్లాజ్’ పద్ధతిలో గర్భాశయ ముఖద్వారానికి కుట్లు వేసి, నిరంతరం పర్యవేక్షించారు. 2026 అక్టోబర్ 7న అంటే 32 వారాల సమయంలో ఉమ్మనీరు బయటకు వచ్చింది. దీంతో అత్యవసరంగా ప్రసవం చేయగా..1.5 కిలోలు, 1.5 కిలోలు, 1.4 కిలోల బరువుతో ముగ్గురు మగ శిశువులు జన్మించారు.
ఎన్‌ఐసీయూలో ప్రత్యేక సంరక్షణ
నెలలు నిండకముందే, తక్కువ బరువుతో పుట్టడంతో ముగ్గురు శిశువులను ఎన్‌ఐసీయూ వార్డుకు తరలించారు. నియోనాటాలజీ డాక్టర్లు, సిబ్బంది రేయింబవళ్లు పిల్లలను కంటికి రెప్పలా కాపాడారు. దీంతో ముగ్గురు చిన్నారులు పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. తల్లితో పాటు ముగ్గురు బిడ్డలు క్షేమంగా ఉండటంతో దవాఖాన నుంచి డిశ్చార్జ్ చేశారు. తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టడంతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.
డాక్టర్ల బృందానికి ప్రశంసలు
ప్రైవేటు దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానలో అరుదైన చికిత్సను విజయవంతం చేసిన డాక్టర్ల బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చికిత్సలో కీలక పాత్ర పోషించిన గైనకాలజీ హెచ్‌ఓడీ ప్రొ. శోభ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ప్రొ. కృష్ణవేణి, ఫాతిమా రఫీ, ఆర్‌ఎంఓలు సుధార్‌సింగ్, శ్రీకాంత్, ఎంబ్రియాలజిస్ట్ శివకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్ అశోక్, కౌన్సిలర్ కవిత, నర్సింగ్ ఆఫీసర్లను డీఎంఈ డాక్టర్ వాణి, గాంధీ ప్రిన్సిపాల్ ఇందిర, సూపరింటెండెంట్ ఉషారాణి అభినందించారు.
