సనత్‌‌‌‌ నగర్ టిమ్స్‌‌‌‌ లో ఏవీ ఫిస్టులా సర్జరీలు 

సనత్‌‌‌‌ నగర్ టిమ్స్‌‌‌‌ లో ఏవీ ఫిస్టులా సర్జరీలు 
  • ప్రైవేటులో రూ. 50 వేల నుంచి 70 వేలు ఖర్చయ్యే సర్జరీ ఫ్రీగా నిర్వహణ
  • వాస్కులర్, నెఫ్రాలజీ నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం
  • డయాలసిస్ కోసం 30 బెడ్లు.. 
  • 14 మిషన్లతో చికిత్సలు షురూ

హైదరాబాద్​, వెలుగు: సనత్‌‌‌‌నగర్​ లోని టిమ్స్ లో డయాలసిస్ రోగులకు కీలకమైన ఆర్టెరియోవీనస్ ఫిస్టులా (ఏవీ ఫిస్టులా) సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ రంగంలో నిమ్స్ తర్వాత ఈ స్థాయి ప్రత్యేక వాస్కులర్ సేవలు ఇక్కడే ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ సర్జరీకి రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు ఖర్చవుతుండగా, టిమ్స్‌‌‌‌లో వాస్కులర్ సర్జన్లు, నెఫ్రాలజీ నిపుణుల పర్యవేక్షణలో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.

దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (సీకేడీ) ఉన్నవారు వారానికి రెండు మూడుసార్లు హీమోడయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. సాధారణ రక్తనాళాలు సూదుల ఒత్తిడిని తట్టుకోలేవు కాబట్టి, సర్జరీ ద్వారా ధమనిని, సిరను కలిపి రక్తప్రవాహ వేగాన్ని పెంచుతారు. తాత్కాలిక క్యాథెటర్లతో పోలిస్తే ఫిస్టులా వల్ల ఇన్‌‌‌‌ఫెక్షన్ల ముప్పు తక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.

ప్రస్తుతం టిమ్స్‌‌‌‌ డయాలసిస్ యూనిట్‌‌‌‌లో 30 బెడ్లు, 14 మిషన్లతో చికిత్సలు ప్రారంభమయ్యాయి. మిగిలిన మిషన్లను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి ఆస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్ల కొరత వల్ల సర్జరీల కోసం రోగులు వారాల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ వెయిటింగ్ లిస్ట్‌‌‌‌ను తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించడంతో నిమ్స్, టిమ్స్ సమన్వయంతో ఈ సర్జరీలను వేగవంతం చేశారు. హైదరాబాద్‌‌‌‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల రోగులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.