- ఎల్లమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్పు: విప్ బల్మూరి వెంకట్
- ఆంధ్రా కాలేజీలతో పాల వ్యాపారం చేయలేదా..?
- సీఎం సభతో సిద్దిపేటకు విముక్తి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- సభ సక్సెస్‌తో హరీశ్‌కు మతి తప్పింది: విప్ ఆది శ్రీనివాస్
- ఇంకా కేసీఆరే సీఎం అనుకుంటున్నడు: అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారన్న ఆరోపణలపై ముందు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు కాంగ్రెస్ విప్ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపింది వాస్తవమా? కాదా? సిద్దిపేట ఎల్లమ్మ తల్లి మీద ఒట్టేసి చీకటి ఒప్పందంపై చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సీఎల్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా కార్పొరేట్ కాలేజీలకు వ్యతిరేకంగా మాట్లాడిన హరీశ్‌రావు.. ఇప్పుడు అదే కాలేజీలతో పాల వ్యాపారం చేస్తున్నది నిజం కాదా? అని బల్మూరి వెంకట్ ప్రశ్నించారు.
సిద్దిపేటలో ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లుంది
సీఎం రేవంత్ సిద్దిపేట సభతో అక్కడి ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ఉందని విప్ వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘సిద్దిపేట నా అడ్డా.. నా గడ్డ’ అంటూ చెప్పుకునే హరీశ్‌రావు బాగోతాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అదే గడ్డపై ఎండగట్టారని అన్నారు. సీఎం సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హరీశ్ పాత ముచ్చట్లు చెప్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్తేనే కల్వకుంట్ల కుటుంబం కలవరపడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు.
అధికారం కోసం మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించి ఉద్యమాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి సభతో అక్కడి ప్రజలకు హరీశ్‌రావు నుంచి విముక్తి లభించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నల్లమల పులిబిడ్డ రేవంత్‌రెడ్డి.. కల్వకుంట్ల కుటుంబం దోపిడీకి అడ్డుకట్ట వేసి, బీఆర్ఎస్ తప్పిదాలను ప్రజల్లో ఎండగట్టి ప్రజాపాలన తీసుకొచ్చారని చెప్పారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారితో హరీశ్ పాల వ్యాపారం చేస్తున్నారా? లేదా? అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.
అబద్ధాలతో చెలరేగిపోతున్న హరీశ్: ఆది
సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన ర్యాలీ, సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి హరీశ్‌రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. సిద్దిపేటలో తన కథ ముగిసిందని అర్థం కావడంతోనే అబద్ధాలతో చెలరేగిపోతున్నారని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. హరీశ్‌రావు ఇప్పటికీ కేసీఆరే ముఖ్యమంత్రి అనుకుంటున్నారని విప్ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సీఎం సభ నిర్వహిస్తే ఎమ్మెల్యేగా ఆయన ఎందుకు హాజరు కాలేదని నిలదీశారు.
