- ఎన్ఆర్2ఎఫ్1, ఎన్ఆర్2ఎఫ్6 జన్యువులతో ఎలుకల్లో సత్ఫలితాలు
- గాయాన్ని దాటి 1.5 మి.మీ. వరకు పెరిగిన నాడులు
- కాళ్ల కదలికలు, గ్రిప్ లో మెరుగుదల
- సీసీఎంబీ సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గాయంతో తెగిన వెన్నుపాము నాడులను తిరిగి పెంచే రెండు జన్యువులను హైదరాబాద్ సీసీఎంబీ సైంటిస్టులు గుర్తించారు. డాక్టర్ ఐశ్వర్య వెంకటేశ్ నేతృత్వంలో జరిగిన పరిశోధనలో ఎన్ఆర్2ఎఫ్1, ఎన్ఆర్2ఎఫ్6 జన్యువులతో ఎలుకల్లో సత్ఫలితాలు వచ్చాయి. ఈ జన్యువులను ప్రవేశపెట్టిన ఎలుకల్లో నాడుల గాయాన్ని దాటి గరిష్టంగా 1.5 మి.మీ. వరకు పెరిగాయి.
వెనుక కాళ్ల కదలికలు, గ్రిప్ బలం కూడా మెరుగయ్యాయి. సాధారణంగా వెన్నుపాము దెబ్బతింటే పెద్దవారిలో నాడుల తిరిగి పెరగవు. దీంతో శాశ్వత పక్షవాతం వస్తుంది. దీనికి ప్రస్తుతం చికిత్స లేదు.
జన్యువుల పనితీరు వేర్వేరు
మెదడు ఎదిగే కొద్దీ ఎన్ఆర్2ఎఫ్1, ఎన్ఆర్2ఎఫ్6 జన్యువుల స్థాయి 70 నుంచి 80 శాతం తగ్గిపోతుంది. అయినా నాడుల పెరుగుదలకు అవసరమైన సమాచారం కణాల్లో అలాగే ఉంటుందని సైంటిస్టులు గుర్తించారు.
ఈ రెండు జన్యువుల్లో దేనిని ప్రవేశపెట్టినా ఒకే తరహా ఫలితం వచ్చింది. అయితే వాటి పనితీరు వేర్వేరు. ఎన్ఆర్2ఎఫ్1 కణంలోని భాగాలు, డీఎన్ఏ అమరికను సరిచేసి నాడుల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఎన్ఆర్2ఎఫ్6 కణంలోని ఇతర సాధారణ పనులను తాత్కాలికంగా తగ్గించి, అవసరమైన ప్రొటీన్లను కాపాడుతుంది. కణంలోని శక్తిని నాడుల రిపేర్లకు మళ్లించడంతోపాటు డీఎన్ఏ మడతలను సరిచేసి, పెరుగుదల జన్యువులు పనిచేసేలా చేస్తుంది.
ప్రాథమిక దశలోనే పరిశోధన
సైంటిస్టులు ఎలుకల్లో గాయం చేయడానికి ముందే ఈ జన్యువులను ప్రవేశపెట్టి, పూర్తి వెన్నుపాముకు గాయం చేశారు. జన్యువులు ఇవ్వని ఎలుకల్లో నాడులు గాయం దగ్గరే ఆగిపోయాయి. జన్యువులు ఇచ్చిన ఎలుకలు నడిచేటప్పుడు వెనుక కాళ్లను పైకి ఎత్తగలిగాయి. గ్రిప్ బలం కూడా పెరిగింది. గాయం తర్వాత ఐదు వారాలకూ ఈ మెరుగుదల కొనసాగింది.
అయితే పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. మనుషులపై ప్రయోగాలకు చేరలేదు. ఎలుకల్లోనూ కదలికలు పూర్తిస్థాయిలో కోలుకోలేదు. భవిష్యత్తులో వెన్నుపాము గాయాలకు జన్యు చికిత్సలు అభివృద్ధి చేసేందుకు ఈ పరిశోధన పునాది వేస్తుందని సైంటిస్టులు తెలిపారు.
