దమ్ముంటే సిద్దిపేటలో పోటీ చెయ్.. నువ్వో నేనో తేల్చుకుందాం రా.. సీఎంకు మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్

దమ్ముంటే సిద్దిపేటలో పోటీ చెయ్.. నువ్వో నేనో తేల్చుకుందాం రా.. సీఎంకు మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్
  • సాగర్ టన్నెల్  సంగతి తెలిసీ దాచిపెట్టిన్రు
  • దొరికినంక బ్యాక్‌‌‌‌‌‌‌‌డేట్ లేఖలతో తప్పించుకునే యత్నం
  • పోతిరెడ్డిపాడు జీవోకు 2 నెలల ముందే మేం రాజీనామా చేసినం
  • 299 టీఎంసీలకు సంతకం పెట్టినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్న హరీశ్ రావు
  • మైక్ కట్ చేయకుండా అసెంబ్లీ సమావేశాలు పెడితే నీళ్లపై జరిగిన అన్యాయాన్ని బయటపెడతానని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ చేస్తున్నారని, వాళ్లో వీళ్లో కాకుండా స్వయంగా ఆయనే వచ్చి సిద్దిపేటలో తనపై పోటీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సవాల్ విసిరారు. ‘వాళ్లో వీళ్లో కాదు. నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్త, నువ్వు కాంగ్రెస్ నుంచి పోటీ చెయ్. నువ్వో నేనో ప్రజల ముందే తేల్చుకుందాం రా. ప్రజలు ఎవర్ని ఆదరిస్తరో, ఎవర్ని చీదరిస్తరో తేలిపోతది. తొట్టి గ్యాంగుతో తిట్టించి సమయం వృథా చేసుకోకు’ అని అన్నారు 

కృష్ణా నీళ్లను అక్రమంగా దోచుకునేందుకే నాగార్జునసాగర్ కుడివైపు ఏపీ ప్రభుత్వం మరో టన్నెల్ కడుతోందని, ఈ విషయం ముందే తెలిసినా సీఎం కావాలనే దాచిపెట్టారని ఆరోపించారు. ఆంధ్రా నీటి దొంగతనానికి సీఎం లోపాయికారిగా సహకరిస్తున్నారని, నాడు బనకచర్ల విషయంలోనూ, నేడు సాగర్ టన్నెల్ విషయంలోనూ బీఆర్ఎస్ నిలదీయగానే బ్యాక్‌డేట్ లేఖలు విడుదల చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

సిద్దిపేట సభలో 63 సార్లు కేసీఆర్ పేరు

సిద్దిపేట సభలో రేవంత్ అబద్ధాలు, టన్నుల కొద్దీ బూతులు మాట్లాడారని మండిపడ్డారు. మూడేండ్ల పాలన వైఫల్యం నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే సభ పేరుతో సర్కస్ ఫీట్లు చేశారని ఎద్దేవా చేశారు. 26 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను తరలించి పార్టీ ప్లీనరీ పెట్టుకున్నారని, ఈ విషయాన్ని పార్కింగ్ స్థలాల పేరుతో స్వయంగా సీపీయే బయటపెట్టారన్నారు. 

సీఎం వస్తే అభివృద్ధి, ఇచ్చే నిధుల గురించో మాట్లాడతారని ప్రజలు ఆశిస్తారని, కానీ సభ ఆద్యంతం తిట్ల దండకమే సాగిందని విమర్శించారు. ఆ సభలో రేవంత్ 63 సార్లు కేసీఆర్ పేరు, 53 సార్లు తన పేరు, 24 సార్లు కేటీఆర్ పేరు తీశారే తప్ప, పత్రికల్లో యాడ్‌లు ఇచ్చి ప్రారంభిస్తామన్న ‘ఇందిరమ్మ జీవిత బీమా’ గురించి ఒక్క మాటా మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. తన పొడుగు గురించి, కేటీఆర్ గడ్డం గురించి వికృత వ్యాఖ్యలు చేయడానికి బోలెడంత ప్రజాధనం వృథా చేసి సిద్దిపేట దాకా రావాలా అని ప్రశ్నించారు.

కోవర్టు, సబ్‌వర్ట్, పర్వర్ట్

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు డబ్బు సంచులతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్, నేడు బాబు జలదోపిడీలో చేతులు కలిపిన ఇంటిదొంగగా మారారని హరీశ్ ఆరోపించారు. రేవంత్ నైజం ‘కోవర్టు, సబ్‌వర్ట్, పర్వర్ట్’ అని వ్యాఖ్యానించారు. గురుదక్షిణ చెల్లించుకునేందుకు వెయ్యి టీఎంసీల నీళ్లను ఏపీకి వదిలిపెట్టారని, సాగర్ టన్నెల్ అక్రమ నిర్మాణాన్ని బీఆర్ఎస్, కేటీఆర్, కొన్ని పత్రికలు బయటపెడితే సీఎంకు ఒళ్లు మండుతోందని అన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో శ్రీశైలం నుంచి నీళ్ల కోసం పోతిరెడ్డిపాడుకు పొక్క కొడితే, నేటి కాంగ్రెస్ పాలనలోనే గోదావరిపై బనకచర్ల, సాగర్ కుడివైపు టన్నెల్ పనులు మొదలయ్యాయని విమర్శించారు.  

పోతిరెడ్డిపాడు, 299 టీఎంసీలపై సవాల్

పోతిరెడ్డిపాడు జీవో 2005 సెప్టెంబర్ 13న వచ్చిందని, అంతకంటే ముందే 2005 జులై 4న తాము మంత్రి పదవులకు రాజీనామా చేశామని హరీశ్ రావు స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినప్పుడు హరీశ్ మంత్రిగా ఉన్నారని సీఎం చేసిన ఆరోపణకు ఆయన  కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జలాల్లో 299:512 టీఎంసీల నిష్పత్తితో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని , ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలోనే ఈ వాటాల అంశం ఉందని, దాన్నే అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ వాటాలపై బీఆర్ఎస్ సంతకం పెట్టినట్లు నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. 

కరువు సమయంలో దేవాదుల దగ్గర 70 టీఎంసీలు, పాలమూరు ప్రాజెక్టు ప్యాకేజీ–3లో చిన్న పని పూర్తి చేస్తే 50 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా, మోటార్లు ఆన్ చేయకుండా నీళ్లను కిందికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ కట్ చేయకుండా అసెంబ్లీ సమావేశాలు పెడితే ఆధారాలతో సహా ఈ ద్రోహాన్ని బట్టబయలు చేస్తానని సవాల్ విసిరారు.