పోలీసు బలగాల్లో మహిళల భాగస్వామ్యం అభినందనీయం : కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌

పోలీసు బలగాల్లో మహిళల భాగస్వామ్యం అభినందనీయం : కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పోలీసు, కేంద్ర సాయుధ బలగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండడం అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పోలీసు బ్యాండ్ పోటీల్లో మహిళా బగ్లర్స్ బృందాలు తొలిసారిగా పాల్గొనడం యూనిఫాంలో మహిళలకు విస్తరిస్తున్న అవకాశాలకు నిదర్శనమని పేర్కొన్నారు. హకీంపేటలోని సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్ గ్రూప్ సెంటర్, రంగారెడ్డి ప్రాంగణంలో శుక్రవారం జరిగిన 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు 2026 ముగింపు వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీస్ బ్యాండ్లు జవాన్ల ఆత్మవిశ్వాసానికి, ఉత్సాహానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. 

పోలీస్ బ్యాండ్ పోటీల వెనుక నెలల తరబడి చేసిన కఠిన శ్రమ, అంకితభావం, పరస్పర స్నేహభావం, సమష్టి కృషి కనిపించిందన్నారు. పోలీస్ బ్యాండ్లు ప్రదర్శనలకే పరిమితం కాదు, క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.  పీఎం మోదీ నాయకత్వంలో, హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో పోలీసు బలగాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తామన్నారు. కాగా, ఐదు రోజులు జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 21 బృందాలకు చెందిన 1,400 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు. వీరిలో 1,100 మంది పురుషులు, 340 మంది మహిళలు ఉన్నారు. బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగుల్ కాల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఔట్‌‌‌‌‌‌‌‌డోర్ డ్రిల్ ప్రదర్శనలు, ఇండోర్ సంగీత ప్రదర్శనలతో బృందాలు తమ ప్రతిభను చాటుకున్నాయి. విజేత బృందాలకు బండి సంజయ్ ట్రోఫీలు, పతకాలను అందజేసి అభినందించారు.