మల్కాజిగిరి,వెలుగు : ఆన్లైన్ పెట్టుబడుల పేరు తో బురిడీ కొట్టించి రూ.74 లక్షలు కాజేసిన తొమ్మిది మందిని మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. జూన్ 8న బాధితుడు సలీమ్‌ను అతడికి చెప్పకుండానే ఓ ఇన్వెస్టర్స్ వాట్సాప్ గ్రూపులో చేర్చారు. అందులో అనన్య మెహ్రా, ప్రణవ్ హరిదాసన్, అదితి అయ్యర్.. స్టాక్ మార్కెట్ చిట్కాలు, షేర్ల కొనుగోలు, అమ్మకాల సూచనలు, బ్లాక్ ట్రేడింగ్ పేరుతో పెట్టుబడి స్కీమ్స్ గురించి ప్రచారం చేశారు. 50 శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించారు.
తాము భారీ లాభాలు పొందుతున్నామని బాధితుడికి ఆశ కల్పించారు. నమ్మిన బాధితుడు విడతలవారీగా రూ.74 లక్షలు బదిలీ చేసి..తర్వాత మోసపోయానని గ్రహించాడు. మల్కాజిగిరి పోలీసుల కు ఫిర్యాదు చేయగా..విచారణ జరిపి ముఠాను గుర్తించారు. ప్రధాన సూత్రధారులైన మహారాష్ట్రకు చెందిన రాహుల్, గౌరవ్ పరారీలో ఉండగా నగరానికి చెందిన మహమ్మద్ అజర్ జానీ, - హెడా శ్రీకాంత్, ముదస్సర్ నజర్, సిద్దవటం శ్రీనివాస్ , మహారాష్ట్రకు చెందిన పర్వేజ్ ఖాన్, ముబీన్ ఖాన్, - ఖమ్మం పట్టణానికి చెందిన మాచర్ల కిరణ్ , కారం ప్రవీణ్ కుమార్, రంగారెడ్డి జిల్లాకి చెందిన దుద్దుకూరు వెంకట శేషు వరప్రసాద్ ను అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ సీఐ నాగాచారి, ఆయన టీమ్ ఈ కేసును ఛేదించింది.
