- ఫొటో మార్ఫింగ్, వాయిస్ క్లోనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- కళాకారుల వ్యక్తిగత, మేధో సంపత్తి హక్కులకు రక్షణ కల్పించాలని వినతి
- ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుపు
- బీజేపీదేనని కేంద్ర మంత్రి ధీమా
న్యూఢిల్లీ, వెలుగు: అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుర్వినియోగం, డీప్‌ఫేక్, మార్ఫింగ్, వాయిస్ క్లోనింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. సినీ నటుడు చిరంజీవి తనకు ఇచ్చిన లేఖను అమిత్ షాకు అందించానని చెప్పారు. హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన సందర్భంగా ఏఐ దుర్వినియోగంతో సినీ కళాకారులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చిరంజీవి ఆయనకు వివరించారు. అనంతరం పలు సూచనలతో కూడిన లేఖను అమిత్ షాకు అందించాలని చిరంజీవి తనను కోరారని, ఆయన విజ్ఞప్తి మేరకు ఆ లేఖను కేంద్ర మంత్రికి వ్యక్తిగతంగా అందించానని చెప్పారు.
ఏఐ ద్వారా వ్యక్తుల ముఖాలు, వాయిస్, చిత్రాలు, ప్రదర్శనలను వారి అనుమతి లేకుండా డిజిటల్‌గా పునఃసృష్టించడం వల్ల కళాకారులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని చిరంజీవి ఆ లేఖలో పేర్కొన్నారు. అనుమతి లేకుండా డీప్‌ఫేక్ సృష్టించడం, ప్రచారం చేయడం, ఇతరుల మాదిరి నటించడం, పరువునష్టం కలిగించే కం-టెంట్‌ను రూపొందించడంపై కఠినమైన సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే, ఏఐ ఆధారిత కం-టెంట్‌పై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ, అక్రమ కం-టెంట్‌ను వేగంగా తొలగించే విధానం, కళాకారుల మేధో సంపత్తి, వ్యక్తిగత హక్కులు, గోప్యతకు చట్టపరమైన రక్షణ కల్పించాలని విన్నవించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీరియస్‌గా పని చేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా వ్యక్తుల హక్కులు, గోప్యత, గౌరవాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు డీప్‌ఫేక్, ఏఐ దుర్వినియోగంపై కఠిన చర్యల కోసం ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
రాహుల్ వ్యాఖ్యలతో దేశ ప్రతిష్టతకు భంగం..
కొలంబియా వర్సిటీ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్‌పై చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలను అంతర్జాతీయ వేదికలపై విమర్శించడం 140 కోట్ల మంది భారతీయులను అవమానించడమేనన్నారు. భారత్ ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఆర్థిక విపత్తు దిశగా వెళ్తోందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. డిఫెన్స్, తయారీ, సెమీకండక్టర్, ఆటోమొబైల్ రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయని, ప్రపంచ దేశాలు భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు పోటీ పడుతున్నాయని తెలిపారు.
మోదీపై రాజకీయ విమర్శలు చేయవచ్చుగానీ, దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. రాహుల్ గాంధీ ఇప్పటికే అనేక ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల ఆలోచనను అర్థం చేసుకోలేకపోతున్నారని, ప్రతిపక్ష నేతగా దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే ఒక్క నిర్మాణాత్మక సూచన కూడా చేయలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులతో రాహుల్ చేతులు కలిపి అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీ ఆట మొదలైంది...
తెలంగాణలో బీజేపీ ఆట మొదలైందని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందు బట్టబయలు చేస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి బలం లేదంటున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు.. బీజేపీ 8 లోక్‌సభ స్థానాలు గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి, కుటుంబ రాజకీయాలు, అక్రమ సంపాదనతో తెలంగాణ వెనుకబడిందని ఆరోపించారు. రాష్ట్రంలో మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు.
