హైదరాబాద్, వెలుగు: తక్కువ వేతనాలు, నెలల తరబడి జీతాల ఆలస్యం, అదనపు విధుల భారం తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆత్మ ఉద్యోగుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. తొమ్మిదేళ్లుగా వేతనాల్లో మార్పు లేదని, ఇతర రాష్ట్రాలతో సమానంగా జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖలో ఆత్మ పథకం కింద 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, ఉద్యోగ అభద్రత సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను సేకరించి ఫైనాన్స్ శాఖకు పంపించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, ఆత్మ ఉద్యోగుల సర్వీసు వివరాలు ఇప్పటివరకు పంపకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మ నిధుల వినియోగంపై విచారణ జరిపి, రైతులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలను మార్గదర్శకాల ప్రకారం అమలు చేయాలని ఉద్యోగుల సంఘం ప్రతినిధి కృష్ణ అద్వంత్ కోరారు.
