తెలంగాణ రైస్ మిల్లర్లకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

తెలంగాణ రైస్ మిల్లర్లకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
  • సీఎంఆర్​ను పూర్తిగా అప్పగించాల్సిందే 
  • లేదంటే ఆ విలువ డబ్బు చెల్లించాలని ఆదేశం
  • రైస్​ మిల్లర్లపై చర్యలకు లైన్ ​క్లియర్​
  • ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 540 కేసులు  

హైదరాబాద్‌, వెలుగు: సీఎంఆర్‌ బకాయిల వ్యవహారంలో డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ మిల్లర్లు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లను శుక్రవారం కొట్టేసింది. దీంతో ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం, బియ్యం పక్కదారి పట్టింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్లపై చట్టపరమైన చర్యలు కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.  

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 540 కేసులు

రాష్ట్రంలో దాదాపు 2,200కు పైగా రైస్‌ మిల్లులు ప్రభుత్వ ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ ప్రక్రియలో భాగస్వాములుగా ఉన్నాయి. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకుని, మిల్లింగ్‌  అనంతరం బియ్యాన్ని నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే 2022–23తో పాటు పలు సీజన్లలో కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌కు తరలించినట్లు తనిఖీల్లో బయటపడింది.  మరికొందరు ప్రభుత్వ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో 2024 నుంచి సివిల్‌ సప్లయ్స్‌ శాఖ ఫిర్యాదుల మేరకు 540 కేసులు నమోదయ్యాయి. అయితే తమపై నమోదైన క్రిమినల్‌ కేసులను కొట్టివేయాలంటూ పలువురు మిల్లర్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. అక్రమాలకు ఆధారాలు ఉన్నాయంటూ 2026 మేలో మిల్లర్ల పిటిషన్లను కొట్టివేసింది. దీంతో మిల్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా మిల్లర్లు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

125 శాతం బకాయిలు.. 12 శాతం వడ్డీ

డిఫాల్ట్‌ మిల్లర్ల నుంచి బకాయిల వసూలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒప్పంద నిబంధనల ప్రకారం బకాయి సీఎంఆర్‌ విలువపై 125% వసూలు చేయనుంది. ఇందులో 25% పెనాల్టీతోపాటు, బకాయి చెల్లించాల్సిన తేదీ నుంచి వాస్తవంగా చెల్లించే వరకు ఏటా 12 % వడ్డీ ఉంటుంది. బకాయి బియ్యాన్ని తిరిగి అప్పగించలేని మిల్లర్లు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమాన పరిమాణంలో ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ కలిపిన సన్నబియ్యాన్ని లేదా దానికి సమానమైన నగదు విలువను చెల్లించాల్సి ఉంటుంది. ఇక బకాయిల వసూళ్లకు రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించాలని కూడా  సివిల్‌ సప్లయ్స్‌ శాఖ భావిస్తున్నది. ఈ చట్టం కింద మిల్లులు, వాహనాలు, బ్యాంకు ఖాతాలు వంటి ఆస్తుల జప్తునకు చర్యలు చేపట్టవచ్చు. 

ఇకపై ఉపేక్షించేది లేదు: సివిల్‌ సప్లయ్స్‌ శాఖ 

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించడం మిల్లర్ల బాధ్యతని సివిల్‌ సప్లయ్స్‌ శాఖ స్పష్టం చేసింది. ధాన్యం, సీఎంఆర్‌ బియ్యం విషయంలో అక్రమాలకు పాల్పడితేఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. నిజాయితీగా వ్యాపారం చేసే మిల్లర్లకు సహకరిస్తామని తెలిపింది. సుప్రీంకోర్టులో తాజా పరిణామాల నేపథ్యంలో డిఫాల్ట్‌ మిల్లర్లపై కేసుల దర్యాప్తు, బకాయిల వసూలు, ఆస్తుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉంది.