మధిర ఏరియా ఆస్పత్రిలో నలుగురు డాక్టర్లు సస్పెన్షన్

మధిర ఏరియా ఆస్పత్రిలో నలుగురు డాక్టర్లు సస్పెన్షన్

ఖమ్మం, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం, సమయపాలన పాటించకపోవడంపై మధిర ఏరియా ఆస్పత్రికి చెందిన నలుగురు డాక్టర్లను ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 19న నిర్వహించిన సమావేశంలో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ మరుసటి రోజైన నవంబర్ 20న సమయానికి విధులకు హాజరుకాకపోవడాన్ని ఆఫీసర్లు తీవ్రంగా పరిగణించారు. కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) నిబంధనలు ప్రకారం నలుగురిని తక్షణమే సస్పెండ్ చేశారు.

సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌కు గురైన వారిలో డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ కె.అనిల్ కుమార్ (జనరల్ మెడిసిన్), డాక్టర్ డి.శ్రీను (పిడియాట్రిక్స్), డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు (ఆర్థోపెడిక్స్), డాక్టర్ పి.శ్రీకాంత్ (రేడియాలజీ) ఉన్నారు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని హెచ్చరించారు.