గత కొంతకాలంగా అల్లర్లు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్ ను మరో సమస్య గోరుచుట్టుపై రోకలిపోటు సామెతలా మారింది. విచ్చలవిడి కల్తీ మద్యంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వందలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం ఏరులైపారుతుండగా అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.గడిచిన ఐదు రోజుల్లో కేవలం 16 మంది చనిపోవడం, దాదాపు 400 మంది ఆస్పత్రుల పాలు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నవంబర్ 15నుంచి 20 వరకు మణిపూర్ లో కల్తీ మద్యం తాగి ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 400 మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిథనాల్ కలిపిన కల్తీ మద్యం వల్లే ఈ దారుణానికి కారణమైందని ప్రాధమిక రిపోర్టులు చెబుతున్నాయి. మణిపూర్ ప్రభుత్వం బాధితులకు చికిత్స, సహాయక చర్యలుచేపట్టగా.. కల్తీ ఎలా జరిగింది.. కల్తీ మద్యం ఎక్కుడనుంచి సరఫరా అయింది అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కేవలం ఐదు రోజుల్లో వందలాది మంది కల్తీ మద్యం బారిన చనిపోవడం , ఆస్పత్రుల్లో చేరడం మణిపూర్ లో కలకలం రేపుతోంది.
డెక్కన్ క్రానికల్ నివేదిక ప్రకారం..చందేల్ జిల్లాలోని చక్పికరోంగ్ తో పాటు దాని పరిసర ప్రాంతాలు, పొరుగున ఉన్న కాక్చింగ్ జిల్లాలోని సుగ్నులో కూడా కల్తీ మద్యం మృతుల సంఖ్య ఎక్కువగా నమోదయ్యాయి. చందేల్ ప్రాంతంలో తొమ్మిది మంది మరణించగా, సుగ్నులో ఏడుగురు మరణించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
చందేల్ జిల్లాలోని చక్పికరోంగ్, వెస్ట్రన్ వ్యాలీ ప్రాంతాలతో పాటు, పొరుగున ఉన్న కక్చింగ్ జిల్లాలోని సుగ్ను ప్రాంతంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అస్వస్థతకు గురైన 370 మందికి పైగా బాధితులను ఇంఫాల్‌లోని షిజా ఆస్పత్రి, బబినా ఆస్పత్రి, జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (JNIMS) తదితర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు.
►ALSO READ | వీళ్లు పిల్లలా.. రాక్షసులా.. ముంబైలో మైనర్ గ్యాంగ్ వీరంగం.. జంటపై కర్రలు, రాళ్లతో దాడి
సుగ్ను నుంచే మద్యం సరఫరా?
కల్తీ మద్యం ఎక్కడ తయారైంది? ఎవరు సరఫరా చేశారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు తాగిన మద్యం కాక్చింగ్ జిల్లాలోని సుగ్ను నుంచి వచ్చినట్లు చందేల్ జిల్లా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. చందేల్‌లో మద్యం తయారు చేయలేదని స్పష్టం చేశారు. అయితే సుగ్ను నుంచి మద్యం ఎవరికి, ఏ మార్గంలో సరఫరా చేశారు? దీని వెనుక ఎవరున్నారు? అనే విషయాలు ఇంకా తేలాల్సి ఉంది.
ఓ వైపు అల్లర్లు.. మరోవైపు కల్తీ మద్యం..
గత కొంతకాలంగా మణిపూర్ లో కొనసాగుతున్న హింసాత్మక పరిణామాలు,ఉద్రిక్తతల క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్లోనూ ఘర్షణలు, భద్రతాపరమైన సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రంలో కల్తీ మద్యం ఘటన మరో సంక్షోభాన్ని సృష్టించింది. అయితే అల్లర్లకు, మద్యం సరఫరాకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఆధారాలు వెల్లడికాలేదు.
సీఎం యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఆస్పత్రులను సందర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. చందేల్‌కు వైద్య బృందాలను పంపడంతో పాటు విచారణకు ఆదేశించారు. అనుమానాస్పద మద్యం సేవించవద్దని అధికారులు హెచ్చరించారు. మద్యం నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపాలని, తయారీ కేంద్రాలు, దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
