డీలిమిటేషన్ వద్దు.. 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు కావాలి:జైరాం రమేశ్

డీలిమిటేషన్ వద్దు.. 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు కావాలి:జైరాం రమేశ్

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై 'ఇండియా'కూటమి తరపున కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ నాలుగు ప్రధాన డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతమున్న 543 లోక్‌‌‌‌సభ స్థానాల సంఖ్యను మార్చకుండా అలాగే కొనసాగించాలని..రాష్ట్రాలకు ఉన్న సీట్ల వాటాను యథాతథంగా ఉంచాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతమున్న 543 లోక్‌‌‌‌సభ స్థానాల్లోనే మూడింట ఒక వంతు (182 సీట్లు) మహిళలకు వెంటనే రిజర్వ్ చేయాలని..డీలిమిటేషన్ వరకు వేచి చూడొద్దని స్పష్టం చేశారు. 

ఈ నిబంధనలన్నింటినీ రాబోయే 25 ఏండ్ల పాటు మార్చకుండా అలాగే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలోని 82వ అధికరణ ప్రకారం 2026 తర్వాత జరిగే తొలి జనాభా గణన ఫలితాలు వచ్చాక డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుందని రమేశ్ గుర్తుచేశారు. అయితే, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే జనాభా వృద్ధిని సమర్థవంతంగా నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. 

దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేందుకు కేంద్రం తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌‌‌‌కు 2027 జన గణనను  ఆధారంగా చేసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంపై డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్) సహా ప్రతిపక్ష కూటమి పూర్తి ఐక్యంగా ఉందని, సుప్రియా సూలే కూడా మద్దతు తెలిపారని వివరించారు. దీనిపై కేంద్రం ఇప్పటివరకు కాంగ్రెస్‌‌‌‌ను సంప్రదించలేదని తెలిపారు.

ఇప్పటికైనా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించి ప్రభుత్వ ప్రణాళికను వివరించాలని కోరారు.పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఆ సమయంలో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడితే ఒక్కతాటిపై నిలబడి గట్టిగా వ్యతిరేకిస్తామని జైరాం రమేశ్ పేర్కొన్నారు.