రూ.9 కోట్ల మందు రూ.2.5 లక్షలకే.. పిలల్ల డాక్టర్ శివరంజని అద్భుతం ప్రయత్నం  

రూ.9 కోట్ల మందు రూ.2.5 లక్షలకే.. పిలల్ల డాక్టర్ శివరంజని అద్భుతం ప్రయత్నం  

ఆమె హైదరాబాద్ కు చెందిన ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్.. అంతేకాదు సామాజిక ఆరోగ్య కార్యకర్త కూడా.. నిరంతరం ఆమె చిన్న పిల్లల ఆరోగ్యం, రక్షణ, మందులు వంటి అంశాలపై పేరెంట్స్ కి అవగాహన కల్పిస్తుంటారు. ఇటీవల ఓఆర్ ఎస్ డ్రింక్ పై పోరాటం చేసి విజయం సాధించారు.. ఇప్పుడు కోట్లలో ఖర్చయ్యే చిన్న పిల్లలకు అరుదైన జన్యువ్యాధులకు తక్కువ ధరలో మందులు అందించేందుకు అద్బుత ప్రయత్నం చేశారు. ఆమెకృషితో వ్యాధి నయం కావడానికి ఏకంగా 9కోట్లు ఖర్చయ్యే మెడిసిన్.. కేవలం రూ.2.5లక్షలకే అందుబాటులో వస్తోంది.. ఫుల్ డిటెయిల్స్..   

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ శివరంజని సంతోష్ చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చింది. ఏడాదికి ఏకంగా రూ.9 కోట్లు ఖర్చయ్యే ఔషధాన్ని కేవలం రూ.2.5 లక్షలకే అందించేలా ఆమె కృషి చేశారు. అంతేకాదు.. ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు ఉచితంగా మందులు అందించేలా ఫార్మా కంపెనీని ఒప్పించారు.

అరుదైన వ్యాధికి ఖరీదైన మందు..

అలన్ హెర్న్డన్ డడ్లీ సిండ్రోమ్ (Allan-Herndon-Dudley Syndrome) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు తిరాట్రికాల్ (Tiratricol) అనే ఔషధాన్ని ఉపయోగిస్తారు. ఈ మందును నెదర్లాండ్స్‌కు చెందిన ఫార్మసీ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. అయితే ఏడాదికి సరిపడా మందుల ఖర్చు సుమారు రూ.9 కోట్లు కావడంతో బాధిత పిల్లల కుటుంబాలకు అది భారంగా మారింది.

డాక్టర్ శివరంజని సంతోష్ ప్రయత్నం ఫలించింది

ఈ పరిస్థితిని గుర్తించిన డాక్టర్ శివరంజని సంతోష్.. మెడిసిన్స్ ఇండియా సంస్థతో కలిసి ప్రయత్నం చేశారు. ఔషధ ధరను భారీగా తగ్గించేలా కంపెనీతో చర్చలు జరిపారు. దీంతో రూ.9 కోట్ల విలువైన ఏడాది ఔషధాన్ని కేవలం రూ.2.5 లక్షలకే అందించేలా ఒప్పించారు. అంతేకాకుండా ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు ఉచితంగా మందులు అందించేందుకు అంగీకారం లభించింది.

►ALSO READ | నూడుల్స్ తిని నిద్రపోయిన ఏడేళ్ల చిన్నారి.. పడుకున్న కాసేపటికే ప్రాణం పోయింది !

ఈ మందులను నవంబర్ 30న చిన్నారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. డాక్టర్ శివరంజని చొరవతో ఖరీదైన వైద్యం అందుకోలేని కుటుంబాలకు కొత్త ఆశలు చిగురించనున్నాయి.

ఎవరీ డాక్టర్ శివరంజనీ సంతోష్.. 

డాక్టర్ శివరంజని సంతోష్ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణురాలు (పీడియాట్రిషియన్) ,సామాజిక ఆరోగ్య కార్యకర్త. నకిలీ ORS పానీయాలపై చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం అంతా ఇంతాకాదు.. మార్కెట్‌లో అధిక చక్కెర కలిగి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాలు లేకుండా  ORS పేరుతో అమ్ముతున్న ఎనర్జీ డ్రింక్స్‌పై ఆమె 8 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఫలితంగా WHO ప్రమాణాలు లేని పానీయాలపై ORS లేబుల్ వాడకూడదని FSSAI కఠిన ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో పీడియాట్రిషియన్‌గా సేవలందిస్తూనే, డాక్టర్ శివరంజని ఆన్‌లైన్ ద్వారా పేరెంట్స్ పిల్లల ఆరోగ్యం, టీకాలు, డెంగ్యూ, తప్పుడు వైద్య ప్రకటనలపై నిరంతరం అవగాహన కల్పిస్తుంటారామె. 
తాజాగా కోట్ల రూపాయల విలువైన అరుదైన జన్యువ్యాధి మందును సామాన్యులకు తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చి ఆమె దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.