అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడాన్ని అధ్యక్షుడు ట్రంప్ తప్పుబట్టారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల అమెరికా ఆర్థిక ప్రగతికి ఆటంకం కలుగుతోందని అన్నారు. ఒకవేళ వడ్డీ రేట్లను తగ్గించినట్లయితే.. అమెరికా జీడీపీ వృద్ధి రేటు 15 నుంచి 20 శాతానికి చేరుకునే అవకాశం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత్ ఆర్థిక వ్యవస్థను ఈ సందర్భంగా ఉదాహరణగా చూపారు. భారత్‌లో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వల్లే అక్కడ 7 శాతం జీడీపీ వృద్ధి సాధ్యమవుతోందని పేర్కొన్నారు. ఫెడరల్ రిజర్వ్ రాజకీయ ప్రేరేపితంగా వ్యవహరిస్తోందని.. అందుకే అమెరికా ఆర్థిక సామర్థ్యాన్ని తక్కువ చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.
"వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఫెడరల్ రిజర్వ్ రాజకీయంగా వ్యవహరించడమే. ఆర్థిక లెక్కలు ఆశాజనకంగా ఉన్నప్పుడు రేట్లు తగ్గించాల్సింది పోయి, అందుకు భిన్నంగా వారు రేట్లను పెంచుతున్నారు. మన దేశ క్రెడిట్ రేటింగ్ బాగున్నప్పుడు వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలి" అని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ గత సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. 2023 తర్వాత వడ్డీ రేట్లు పెరగడం ఇదే తొలిసారి. ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లక్ష్యానికి పరిమితం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ తెలిపారు. అయితే ట్రంప్ మాత్రం ఈ వడ్డీ రేట్ల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
►ALSO READ | కిలో వెండి లక్ష రూపాయలకు పడిపోతుందా.. వచ్చే జనవరి నాటికి ఇది జరగబోతుందా..?
మరోవైపు భారత రిజర్వ్ బ్యాంక్ కూడా అక్టోబర్‌లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. గ్లోబల్ మార్కెట్ ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానిటరీ పాలసీ కమిటీ పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ.. పరపతి పెరుగుదల కారణంగా కొన్ని రిస్క్‌లు ఉన్నాయని ఆర్బీఐ అంచనా వేసింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం.. 2026లో భారత్ 7 శాతం వృద్ధి రేటుతో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగనుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ భారత్ తన వృద్ధిని నిలబెట్టుకుంటుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. దీనిని ప్రస్తావిస్తూ అమెరికా కూడా అదే స్థాయిలో వృద్ధి సాధించాలంటే వడ్డీ రేట్ల తగ్గింపు అవసరమని ట్రంప్ వాదిస్తున్నారు.
