టాలీవుడ్ లో 'హనుమాన్' సీక్విల్ చుట్టూ ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకే ఫ్రాంచైజీ నుంచి రెండు సినిమాలు తెరపైకి రాబోతున్నాయా? అసలు 'హనుమాన్' కథను ఎవరు కొనసాగించబోతున్నారు? అన్న ప్రశ్నలు సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. లేటెస్ట్ గా ఈ చర్చకు మరింత ఆజ్యం పోస్తూ.. మొదటి భాగాన్ని నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంచలన ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది.
లేటెస్ట్ గా 'హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్' పేరుతో కొత్త సినిమాను ప్రకటించింది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా, విభిన్నమైన కథాంశాలతో గుర్తింపు తెచ్చుకున్న వీఐ ఆనంద్ దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. గతంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఊరు పేరు భైరవకోన' వంటి ఫాంటసీ థ్రిల్లర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆనంద్.. ఈసారి పౌరాణిక నేపథ్యాన్ని ఏ స్థాయిలో ఆవిష్కరిస్తారన్నది ఆసక్తి నెలకొంది.
ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. కాషాయ వస్త్రధారణలో వైష్ణవ్ తేజ్ వెనక్కి తిరిగి నిలబడగా, భారీ హనుమంతుడి తోక ఆయనను చుట్టుకుని ఆకాశంలోకి ఎత్తుతున్నట్లుగా డిజైన్ చేసిన విజువల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ అధినేతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించనున్నారు. దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే కథ, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం, షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
►ALSO READ | పెళ్లి పీటలెక్కబోతున్న శివ కందుకూరి
అయితే 'హను-మాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే 'జై హనుమాన్' చిత్రాన్ని ప్రకటించారు. ఇందులో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరోవైపు 'హను-మాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మ మధ్య ఆర్థిక లావాదేవీలు, గతంలో కుదిరిన ఒప్పందాల విషయంలో వివాదం తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ప్రశాంత్ వర్మ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
ఇప్పుడు ప్రైమ్‌షో ప్రకటించిన 'హనుమాన్ 2', ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న'జై హనుమాన్'.. ఈ రెండు ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఇవి ఒకే కథా ప్రపంచానికి చెందిన సినిమాలా? లేక వేర్వేరు కథలతో రూపొందుతున్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా హనుమంతుడి పేరు మీద టాలీవుడ్‌లో మొదలైన ఈ సీక్వెల్ పోటీ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి...
