బెంగళూరులో దారుణం: కొడుకును సుత్తితో కొట్టి చంపి.. భార్యను మూడు రోజులు గదిలో బంధించిన కిరాతకుడు

 బెంగళూరులో దారుణం: కొడుకును సుత్తితో కొట్టి చంపి.. భార్యను మూడు రోజులు గదిలో బంధించిన కిరాతకుడు

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సుత్తితో కొడుకుపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం భార్యను కూడా చంపేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె ప్రాణాలతో బయటపడటంతో, ఆమెను అపార్ట్‌మెంట్‌లోని ఓ గదిలో మూడు రోజుల పాటు బంధించాడు. చివరకు ఈ విషయం పోలీసులకు తెలియడంతో బాధితురాలిని రక్షించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనాభనగర్‌లోని ఎస్ఆర్ఆర్‌కే తులసి అపార్ట్‌మెంట్‌లో నవంబర్ 16న ఈ ఘోరం జరిగింది. నిందితుడిని సుదీప్‌గా గుర్తించారు. తన కొడుకు సోహమ్ దాస్‌ను బాత్‌రూమ్‌లో సుత్తితో కొట్టి హత్య చేశాడు. భార్య సీమా దాస్‌పై కూడా కత్తి, సుత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఆమెను చంపేందుకు ప్రయత్నించి విఫలమవ్వడంతో, గదిలో వేసి బయట నుంచి తాళం వేసి పారిపోయాడు. మూడు రోజుల పాటు బందీగా ఉన్న ఆమెను చివరికి పోలీసులు రక్షించారు.

అపార్ట్‌మెంట్ ఓనర్ మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కుటుంబం 2024 నుంచి అక్కడ అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఆరు నెలలుగా ఆ ఇంట్లో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, దీనిపై ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేశారని మల్లయ్య పేర్కొన్నారు. గొడవలు మానుకోవాలని లేదా ఇల్లు ఖాళీ చేయాలని తాను ఇదివరకే ఆ కుటుంబానికి సూచించినట్లు ఆయన తెలిపారు. 

నవంబర్ 16న మళ్లీ గొడవ జరుగుతుండటంతో పక్కింటి వారు ఓనరుకి ఫోన్ చేశారు. అప్పుడు ఓనర్ మల్లయ్య సెక్యూరిటీ గార్డును విచారించగా అంతా ప్రశాంతంగానే ఉందని సమాధానం ఇచ్చాడు. అయితే, నవంబర్ 19న మల్లయ్య స్వయంగా అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తలుపు తట్టగా లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనుమానం రావడంతో ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

పోలీసు బృందం అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా.. నేలపై రక్తపు మరకలు కనిపించాయి. గదిలో నుంచి సీమా కేకలు వేయడం వినిపించింది. పోలీసులు ఆమెను రక్షించిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాత్‌రూమ్‌లో సోహమ్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. తన భర్త సుదీప్ మా ఇద్దరిపై దాడి చేశాడని, కుమారుడిని చంపేసి తనను గదిలో బంధించాడని సీమా పోలీసులకు వివరించింది.

బనశంకరి పోలీసులు నిందితుడు సుదీప్‌పై  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే ఈ దారుణానికిగల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.