ఈఎంఐలో ఫోన్ కొనిచ్చిన భర్త.. ఎక్కువగా వాడొద్దన్నందుకు ఉరేసుకున్న భార్య.. నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన

ఈఎంఐలో ఫోన్ కొనిచ్చిన భర్త.. ఎక్కువగా వాడొద్దన్నందుకు ఉరేసుకున్న భార్య.. నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన

బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. భర్త పెయింటింగ్ పని చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. భార్య కోరిక కాదనలేక ఈఎంఐలో ఫోన్ కొనిచ్చాడు భర్త. అయితే ఫోన్ కు బానిసైన వివాహిత తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. తను లేకుంటే వాళ్ల భవిష్యతు ఏమవుతుందని కూడా ఆలోచించకుండా ఉరేసుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.  

వివరాల్లోకి వెళ్తే.. కల్వకుర్తి మండలం ఎల్లమ్మ రంగాపురం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి కిష్ణయ్య, అలివేలు దంపతుల కూతురు  లక్ష్మీదేవి (25) హైదరాబాద్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏడేళ్ల క్రితం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం టీపీగౌరారం గ్రామానికి చెందిన పగిళ్ల లక్ష్మణ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పనుల కోసం హైదరాబాద్ వచ్చి  భర్త, అత్త, మామ, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్‌నగర్ సమీపంలోని బొమ్మలగుడిలో అద్దె ఇంట్లో ఉంటోంది. 

భర్త లక్ష్మణ్ పెయింటర్‌గా పనిచేస్తుండగా.. అత్త ఇళ్లల్లో పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాల్సిందిగా కోరడంతో లక్ష్మీదేవికి ఈఎంఐ ద్వారా కొత్త ఫోన్ కొనిచ్చాడు భర్త లక్ష్మణ్. అయితే లక్ష్మీదేవి  తరచూ ఫోన్‌లోనే నిమగ్నమవుతూ పిల్లలను, ఇంటి పనులను నిర్లక్ష్యం చేస్తుండటంతో.. ఫోన్ వాడకం తగ్గించాలని ఆమె తల్లి సూచించింది.

ఊరికే ఫోన్ చూస్తూ కూర్చుంటే ఎలా అమ్మా, ఏదో ఒక పని చేసుకోవాలి కదా  అంటూ కూతురిని తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన కూతురు..  ఇద్దరు పిల్లలు (కూతురు 7, కొడుకు 3)ను టీవీ చూడమని చెప్పి, గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఇంకా ఓనమాలు కూడా దిద్దని పిల్లలు తల్లిలేని పక్షులయ్యారని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.