2017లో ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం పోయింది. అప్పుడు జీతం ఏడాదికి కేవలం రూ.3లక్షలు. కానీ తొమ్మిదేళ్ల తర్వాత అదే వ్యక్తి సంపద విలువ అక్షరాలా రూ.11 కోట్లు. అంతేకాదు యూఏఈలోని ఒక కన్సల్టింగ్ ఫర్మ్ నుంచి ఏడాదికి రూ.కోటి 50లక్షల భారీ ప్యాకేజీతో ఆఫర్ అందుకున్నారు. డేటా ఇంజనీర్‌గా పనిచేస్తున్న ముకుంద్ ప్రజాపతి ప్రయాణం ఐటీ రంగంలో స్కిల్స్ ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది.
ముకుంద్ ప్రజాపతి 2015లో ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2017లో ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో మాన్యువల్ టెస్టర్‌గా చేరారు. అయితే కంపెనీ నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ సమయంలో తండ్రి తీసుకున్న రూ.2 లక్షల 50వేలు ఎడ్యుకేషన్ లోన్ భారంతో ముకుంద్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కానీ కృంగిపోకుండా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐబీఎంలో చేరిన తర్వాత పైథాన్, ఎస్‌క్యూఎల్, హడూప్, స్పార్క్ వంటి టెక్నాలజీలను సొంతంగా నేర్చుకున్నాడు. 2022 జనవరి వరకు కూడా ముకుంద్ జీతం ఏడాదికి కేవలం రూ.3 లక్షల 78వేలే. ఐదేళ్ల అనుభవం ఉన్నా తక్కువ జీతం వస్తుండటంతో ఇతర కంపెనీల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించాడు.
మార్కెట్లో తనకున్న డిమాండ్‌ను గుర్తించిన ముకుంద్.. ఇతర కంపెనీల నుంచి వచ్చిన ఆఫర్లను చూపించి తన జీతాన్ని రూ.13 లక్షలకు పెంచుకున్నారు. అక్కడి నుంచి ఆయన కెరీర్ వేగంగా పుంజుకుంది. గడిచిన మూడేళ్లలో ఆయన జీతం రూ.3 లక్షల 78వేల నుంచి రూ.62 లక్షలకు చేరింది. ఇప్పుడు యూఏఈ కంపెనీ నుంచి ఏడాదికి రూ.కోటి 50లక్షల ఆఫర్ పొందినట్లు ముకుంద్ తెలిపారు.
ముకుంద్ తన ఆదాయాన్ని కేవలం ఖర్చులకే పరిమితం చేయకుండా క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.11 కోట్ల 53లక్షలుగా ఉంది. ఇందులో రూ.65 లక్షల హోమ్ లోన్ పోను.. నికర ఆస్తి రూ.10కోట్ల 88లక్షలు. ఇందులో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్, బంగారం, పీపీఎఫ్, ఈపీఎఫ్, ఎన్పీఎస్ వంటివి ఉన్నాయి.
ముకుంద్ భార్య కూడా ఐటీ రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలిసి తమ జీతంలో మెజారిటీ ఆదాయాన్ని పొదుపు చేస్తూ వచ్చారు. నెలకు రూ.10 వేలతో మొదలైన SIPపెట్టుబడులను ఆదాయం పెరిగే కొద్దీ పెంచుకుంటూ వెళ్లారు. విలాసాలకు దూరంగా ఉంటూ.. జీతం పెరిగినా లైఫ్‌స్టైల్ ఖర్చులను పెంచుకోకపోవడమే తమ సక్సెస్ సీక్రెట్ అని ముకుంద్ చెప్పారు.
ముకుంద్ లక్ష్యం 45 ఏళ్ల వయసుకల్లా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించడం. అంటే పని చేయడం అనేది ఒక ఛాయిస్‌గా ఉండాలి తప్ప అవసరంగా ఉండకూడదని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం తన ఆస్తుల్లో 43 శాతం రియల్ ఎస్టేట్‌లోనే ఉందని.. భవిష్యత్తులో లిక్విడిటీ కోసం ఫైనాన్షియల్ అసెట్స్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు ముకుంద్ స్పష్టం చేశారు.
