ఆధార్ కార్డ్ కేవలం గుర్తింపు కార్డు మాత్రమే.. పుట్టిన తేదీకి రుజువు కాదు.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

ఆధార్ కార్డ్ కేవలం గుర్తింపు కార్డు మాత్రమే..  పుట్టిన తేదీకి రుజువు కాదు.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

ఆధార్ కార్డును కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే పరిగణించాలని, దానిని పుట్టిన తేదీకి (DOB) రుజువుగా భావించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఒక ఉద్యోగి రిటైర్మెంట్ వివాదంలో యాజమాన్యం సమర్పించిన వాదనను తోసిపుచ్చుతూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అధికారిక రికార్డుల్లో ఒక తేదీని నమోదు చేసి, రిటైర్మెంట్ సమయంలో ఆధార్‌లోని మరో తేదీని సాకుగా చూపుతూ ఉద్యోగిని ఏడాది ముందే తొలగించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.

ఒక ఎలక్ట్రానిక్స్ సంస్థలో పని చేస్తున్న మహిళా ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించిన వ్యవహారంలో జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ ఈ తీర్పునిచ్చారు. 2010లో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) రికార్డుల్లో యాజమాన్యమే స్వయంగా సదరు మహిళ పుట్టిన తేదీని 1960, మే 20గా నమోదు చేసింది. అయితే, రిటైర్మెంట్ సమయంలో ఆమె ఆధార్ కార్డును తీసుకున్న యాజమాన్యం, అందులో 1959, మే 20 అని ఉందన్న కారణంతో ఆమెకు 58 ఏళ్లు నిండాయని పేర్కొంటూ మే 2017లోనే సర్వీసు నుంచి తొలగించింది.

దీనిపై స్పందించిన హైకోర్టు.. "ఒకసారి రికార్డుల్లో 1960ని పుట్టిన తేదీగా నమోదు చేసిన తర్వాత, యాజమాన్యం తన ఇష్టానుసారం ఆధార్‌లోని మరో తేదీని ప్రామాణికంగా తీసుకుని ఏడాది ముందే ఉద్యోగిని తొలగించడం సాధ్యం కాదు" అని స్పష్టం చేసింది. ఈ వివాదం తలెత్తడానికి కేవలం రెండు నెలల ముందు మాత్రమే యాజమాన్యం ఆమె ఆధార్ కార్డును తీసుకుందని, దానికి ప్రూఫ్ గా మరే ఇతర ఆధారాలను సమర్పించలేదని కోర్టు గుర్తించింది.

ఈ కేసు వివరాల ప్రకారం.. సదరు మహిళ 1981, డిసెంబర్ 1 నుంచి ఆ సంస్థలో 'ఫినిషింగ్ మ్యాన్'గా పనిచేస్తున్నారు. మార్చి 2017లో ఢిల్లీ ప్రభుత్వం కనీస వేతనాల్లో మార్పులు చేయడంతో, ఆమె సవరించిన వేతనం చెల్లించాలని కోరారు. ఆ తర్వాత మే 20, 2017న ఆమె బకాయి వేతనాలు అడిగిన సమయంలోనే యాజమాన్యం ఆమెను విధుల్లో నుంచి తొలగించింది. ఆమె వయసు 58 ఏళ్లు నిండాయని, అందుకే రిటైర్మెంట్ ఇచ్చామని కంపెనీ వాదించింది. అంతేకాకుండా, ఆమెకు కంటి ఆపరేషన్ జరిగిందని, స్వచ్ఛందంగానే రాజీనామా చేశారని మరో వాదనను తెరపైకి తెచ్చింది.

ఈ వాదనలను తోసిపుచ్చుతూ, ఒక ఉద్యోగికి పదవీ విరమణ వయసు వచ్చిందని నిరూపించాల్సిన బాధ్యత యాజమాన్యంపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ కార్డు పుట్టిన తేదీకి ఆధారమని నిరూపించేందుకు UIDAI అధికారులను కూడా యాజమాన్యం విచారించలేదని కోర్టు ఎత్తిచూపింది. మరోవైపు, ESIC అధికారులు లేబర్ కోర్టులో సాక్ష్యం చెబుతూ.. యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకే 1960ని పుట్టిన తేదీగా నమోదు చేశామని ధృవీకరించారు.

ఆధార్ కార్డు అనేది కేవలం వ్యక్తి గుర్తింపు కోసమేనని, అది వయసును నిర్ధారించే రుజువు కాదని సుప్రీంకోర్టు గతంలో 'సరోజ్ వర్సెస్ ఇఫ్కో-టోకియో జనరల్ ఇన్సూరెన్స్' కేసులో ఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. లేబర్ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు సరైనదేనని సమర్థిస్తూ, మే 20, 2017 నుంచి మే 20, 2018 వరకు ఆ మహిళకు నెలకు రూ.14,698 చొప్పున పూర్తి బకాయి వేతనాలు చెల్లించాలని ఆదేశించింది. దీనికి ఆరు శాతం వడ్డీని కూడా కలిపి, నాలుగు వారాల్లోగా బకాయిలు చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశిస్తూ రిట్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.