- గోవాలో క్యాబోల్తీ పబ్లిక్..
- నవంబర్ 22నుంచి సీజేపీ క్యాంపెయిన్ షురూ
గతంలో విద్యా వ్యవస్థలో అవకతవకలపై విద్యార్థుల ఉద్యమానికి నాయకత్వం వహించిన సీపీజే.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పై పోరాటంనుంచి కేంద్ర ఎన్నికల సంఘం (CEC)పై నిరసనల వరకు.. వరుస ఉద్యమాలతో వార్తల్లో నిలిచిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు సాగించిన పోరాటాలకు తాత్కాలిక విరామం ఇచ్చిన పార్టీ.. ఈసారి వినూత్న పంథాలో ఉద్యమాన్ని ప్రారంభిస్తోంది. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటిపై పోరాడటమే లక్ష్యంగా ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో జాతీయ ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
క్యాంపెయిన్ ఎప్పుడు..ఎక్కడ..?
ఈ నేషనల్ క్యాంపెయిన్ ను నవంబర్ 22న పనాజీలోని కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. గోవాలో ఈ కార్యక్రమానికి ‘చల్లా కితేం, గోవా’ (గోవాలో ఏం జరుగుతోంది?) అనే రాష్ట్ర స్థాయి కార్యక్రమంతో కలిపి ప్రారంభించనున్నారు. వేలాది మంది పాల్గొననున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సీపీజే చీఫ్ అభిజీత్ దీప్కేతో పాటు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, గోవా చీఫ్ అఫ్రీన్ షేక్ తో కలిసి స్థానికంగా కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు హాజరై తమ సమస్యలను చెప్పుకోవచ్చని నిర్వాహకకులు చెబుతున్నారు.
లక్ష్యం ఏంటి?..
గోవాలో భూముల సమస్యలు, ప్రజా భద్రత, రవాణా, కార్మికుల హక్కులు, విద్య వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నారు. ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిపై నిరంతరం పనిచేయడం ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం. ప్రజల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా సమస్యలను గుర్తించి, పరిష్కారాల దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీజే భావిస్తోంది.
భవిష్యత్తులో కాక్రోచ్ల కార్యాచరణ
గతంలో విద్యా వ్యవస్థలో అవకతవకలపై విద్యార్థుల ఉద్యమానికి నాయకత్వం వహించిన సీపీజే.. అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాతో ఉద్యమ విజయం సాధించింది. తాజాగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కూడా పోరాటాన్ని కొనసాగిస్తోంది. నవంబర్ 7న కేరళలోని కొచ్చిలో సైతం నిరసన చేపట్టింది. ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్లకుండా ప్రజా ఉద్యమ వేదికగా కొనసాగుతామని గతంలో ప్రకటించిన ఈ పార్టీ .. ఇకపై స్థానిక సమస్యల నుంచి జాతీయ స్థాయి అంశాల వరకు ప్రజల గొంతుకగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.
