ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న నాలుగు కార్లు.

ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న నాలుగు కార్లు.

హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. వరుసగా వెళ్తున్న నాలుగు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి కాళ్లు ఫ్రాక్చర్ కాగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

రాజేంద్ర నగర్ సమీపంలోని ఓఆర్ఆర్‌పై ఈకో పార్క్ పక్కన బ్లాస్టింగ్ పనులు జరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా నెమ్మదించి, కొన్ని కార్లు రోడ్డుపై నిలిచిపోయాయి. ఇదే క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ముందు ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో వరుసగా ఉన్న నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొని తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఢీకొన్న ధాటికి కార్లలో ఉన్న ప్రయాణికులు వాహనాల్లోనే ఇరుక్కుపోయారు. 

కార్లకు భారీగా నష్టం జరగడంతో పాటు పలువురు గాయాలపాలయ్యారు. ఇద్దరికి కాళ్లు ఫ్రాక్చర్ కాగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంతో ఓఆర్ఆర్‌పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.