టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన పైరసీ గ్యాంగ్.. రిలీజ్ అయిన గంటల్లోనే నాలుగు సినిమాలు లీక్!

టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన పైరసీ గ్యాంగ్.. రిలీజ్ అయిన గంటల్లోనే నాలుగు సినిమాలు లీక్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం మరోసారి వణికిస్తోంది. ఎంతో కష్టపడి, కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు .. థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే వాటిని ఇంటర్నెట్ లోకి ఎక్కించేస్తున్నారు కేటుగాళ్లు. లేటెస్ట్ గా నాలుగు తెలుగు మూవీస్ ఆన్ లైన్ పైరసీకి గురికావడం సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా నవంబర్ 20న థియేటర్లలో విడుదలైన 'ఆకాశంలో ఒక తార' మూవీ గంటల వ్యవధిలోనే పైరసీ వైబ్ సైట్లలో ప్రత్యక్షం కావడం చిత్ర బృందాన్ని షాక్ కు గురిచేసింది.

ఈ పైరసీ జాబితాలో 'ఆకాశంలో ఒక తార' తో పాటు 'రణబాలి', 'కల్ట్', 'ఆదర్శ కుటుంబం' చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు పైరసీ కాపీలు go2.india4movies.click అనే వెబ్‌సైట్‌లో అక్రమంగా అప్‌లోడ్ అయినట్లు గుర్తించారు. దీంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ అప్రమత్తమైంది.

క్యూబ్ సినిమా టెక్నాలజీస్ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.. 'రణబాలి', 'కల్ట్', 'ఆదర్శ కుటుంబం' చిత్రాలను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సిటీ స్క్వేర్ మాల్ థియేటర్‌లో కొందరు వ్యక్తులు క్యామ్‌కార్డర్‌తో రహస్యంగా చిత్రీకరించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ యర్రా మణీంద్రబాబు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. థియేటర్ సీసీటీవీ ఫుటేజ్, టికెట్ బుకింగ్ వివరాలు, షో సమయాలను పరిశీలించే అవకాశం ఉంది. పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకులు, అక్రమంగా సినిమాలను అప్‌లోడ్ చేసిన వ్యక్తుల గుర్తింపుపై కూడా దృష్టి సారించారు పోలీసులు.

పైరసీ వల్ల నిర్మాతలకు మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు.. ఇలా మొత్తం సినిమా పరిశ్రమకు ఆర్థిక నష్టం వాటిల్లుతుంది సినీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త సినిమాలను థియేటర్లలోనే చూసి ప్రోత్సహించాలని సినీ ప్రముఖులు కోరుతున్నారు. మరి ఈ పైరసీ ముఠా వెనుక ఎవరున్నారు? ఈ అక్రమ నెట్‌వర్క్‌ను పోలీసులు ఎలా ఛేదిస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది...