ఇంట్లో నిల్వ ఉంచిన ఆముదపు గింజలు చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో శనివారం(నవంబర్ 21)చోటు చేసుకుంది. తినే వస్తువులు భావించి ఆముదపు గింజలు తినడంతో ఆరుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు చిన్నారులను ఆదిలాబాద్ రిమ్స్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..
అదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి గ్రామానికి చెందిన ఆరుగురు చిన్నారులు ఆముదపు గింజలు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారులను 108 అంబులెన్స్ లో ఉట్నూర్ హస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం రిమ్స్ లో చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి ఆరుగురు చిన్నారులు అనారోగ్యానికి గురి కావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
