ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. 19 సీజన్ల సుదీర్ఘ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతూ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆటగాడిగా తప్పుకుని, IPL 2027 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మెంటార్‌గా కొత్త అవతారమెత్తాడు. రిటెన్షన్ జాబితాకు ముందే తాను ఇక ఆటగాడిగా కొనసాగలేనని ధోనీ స్వయంగా మేనేజ్‌మెంట్‌కు స్పష్టం చేశాడు. కానీ, ఈ నిర్ణయం తనకు కూడా ఊహించని షాక్ ఇచ్చిందని CSK కొత్త హెడ్ కోచ్ జహీర్ ఖాన్ (Zaheer Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సైలెంట్‌గా ధోనీ రిటైర్మెంట్ ఇచ్చేశాడు:
CSK అధికారిక యూట్యూబ్ ఛానెల్‌తో హెడ్ కోచ్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ మూడు ఏళ్ల సైకిల్‌లో ఇది చివరి ఏడాది కావడంతో ధోనీ రిటైర్ అవుతాడని నేను అస్సలు ఊహించలేదు.. ఆ ఆలోచనే నాకు రాలేదు.. కానీ అతడు ఎంఎస్ ధోనీ.. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు.. ఎలాంటి హడావుడి, వార్తలు సృష్టించడం ఇష్టం లేక చాలా సున్నితంగా తన నిర్ణయాన్ని మాకు చెప్పాడని జహీర్ వెల్లడించారు.
ఎమోషనల్ వీక్: మా అందరికీ ఇది చాలా ఎమోషనల్ వారం.. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఎంఎస్ ధోనీ జట్టు కోసం ఆడతాడని ఆశించాం.. ఇప్పుడు కూడా జట్టుతోనే ఉంటాడు, కానీ మెంటార్ అనే కొత్త అవతారంలో కనిపిస్తాడు.. నా భారాన్ని షేర్ చేసుకుని, జట్టును సరైన దిశలో నడిపిస్తాడనే ఆనందం ఉన్నా.. ఆయన ఆటగాడిగా తప్పుకోవడం కాస్త బాధగా ఉందని జహీర్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు.
ధోనీ, జహీర్ మధ్య బాధ్యతల విభజన:
టీమిండియాలో సుదీర్ఘకాలం కలిసి ఆడిన ధోనీ, జహీర్ ఖాన్ ఇప్పుడు CSK డగౌట్‌లో కోచ్-మెంటార్‌గా జట్టును నడిపించనున్నారు. బాధ్యతల విభజనపై జహీర్ మాట్లాడుతూ.. మా మధ్య ఎలాంటి హద్దులు లేవు.. హోదాలు అనేవి కేవలం ప్రక్రియను సులభతరం చేయడానికి మాత్రమే.. ఇద్దరం ఒకే ఆలోచనతో జట్టును ముందుకు తీసుకెళ్తాం.. ధోనీ నాయకత్వంలో ఉన్న అతి పెద్ద బలం నమ్మకం (Trust).. ఆటగాళ్లు సరైన పని చేస్తారని ఆయన పూర్తిగా నమ్ముతాడు.. ఫలితాలు తారుమారైనప్పుడు మాత్రమే జోక్యం చేసుకుంటాడు.. ప్లేయర్స్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చి శక్తివంతులను చేయడమే మహీ గొప్పతనం అని జహీర్ ఖాన్ వెల్లడించాడు.
Retentions, the road ahead & the Thala connection! 🦁 Zaheer Khan in conversation about the next chapter of Chennai Super Kings Watch full episode now https://t.co/egaeJdu9sI #WhistlePodu #Yellove https://t.co/mxY4mtnKd0
— Chennai Super Kings (@ChennaiIPL) November 20, 2026
