నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ పరిశీలన చేస్తోందని, వారిపై చర్యల విషయంలో ఏఐసీసీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కొండా సురేఖ విషయంలోనూ తొలిసారే చర్యలు తీసుకోలేదని, రెండు మూడు సార్లు పరిశీలించిన తర్వాతే ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యల అంశాన్ని కూడా ఏఐసీసీ పరిశీలిస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ ఆరోపణలపై స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్.. తెలంగాణ నీటి వాటా విషయంలో ఒక్క బొట్టు నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని, తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.
కేటీఆర్ ఆరోపణలకు మహేశ్ గౌడ్ కౌంటర్
కేటీఆర్ చేసిన ఆరోపణలపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ఫార్ములా ఈ-కార్ రేసు, కాళేశ్వరం, భూ కుంభకోణాల వ్యవహారాల్లో అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిన అవినీతిపరులంటూ విమర్శించారు.
ఢిల్లీకి మూటలు పంపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. రాహుల్ గాంధీ సంపన్న కుటుంబంలో పుట్టారని, ఆయనపై విమర్శలు చేసే ముందు ఆయన చేసిన త్యాగాలను ఒకసారి తెలుసుకోవాలని కేటీఆర్కు సూచించారు.
