హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఎప్పుడైనా రావచ్చని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ స్థానంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారిందన్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారాన్ని రాజాసింగ్ ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఫేక్ ప్రచారాలని స్పష్టం చేశారు. బీజేపీలో ఇప్పటికే చాలామంది సమర్థులైన అభ్యర్థులు ఉన్నారని, అలాంటప్పుడు ఇతర పార్టీల నుంచి వ్యక్తులను చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాగేందర్ చేసిన తప్పుల కారణంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా ప్రజలు బీజేపీ వైపే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, ఖైరతాబాద్ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఈ ఉప ఎన్నికలో గెలుపు సాధించడం ద్వారా రానున్న కార్పొరేషన్ ఎన్నికలతో పాటు భవిష్యత్ ఎన్నికల్లోనూ మంచి రాజకీయ వాతావరణం ఏర్పడుతుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం తమకు అందుతున్న సమాచారం ప్రకారం ఖైరతాబాద్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.
