వాషింగ్టన్: ఇండియా పట్ల చైనా కపట బుద్ధి మరోసారి బయటపడింది. భారత్ ఎదుగుదలను ఓర్వలేక డ్రాగన్ కంట్రీ పన్నుతున్న కుతంత్రాలను అమెరికా బట్టబయలు చేసింది. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా అండగా నిలిచిందని అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ సంచలన విషయాలు వెల్లడించింది. భారతదేశ ఆర్థిక, వ్యూహాత్మక ఎదుగుదలను అరికట్టే విస్తృత ప్రణాళికలో భాగంగానే పాకిస్తాన్‌కు చైనా సైనిక, సాంకేతిక సహయం అందించిందని తెలిపింది. అలాగే, భారతదేశాన్ని అదుపులో ఉంచడానికి సరిహద్దు వెంబడి సైనిక ఒత్తిడి, పారిశ్రామిక సరఫరాలపై చైనా ఆంక్షలను ఉపయోగిస్తోందని కూడా వెల్లడించింది.
యూఎస్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ తన 2026 వార్షిక నివేదిక విడుదల చేసింది. ఇందులో భారత్‌పై చైనా, పాకిస్తాన్ చేస్తోన్న కుట్రలను బహిర్గతం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా నేరుగా యుద్ధంలోకి దిగకుండానే పాకిస్థాన్‌కు అండగా నిలిచిందని తెలిపింది.
భారత్‌కు ఏకకాలంలో రెండు వైపుల నుంచి ముప్పు
ఈ ఘర్షణలో పాకిస్థాన్‌కు అధునాతన ఆయుధాలు, నిఘా సమాచారం, సైబర్ కార్యకలాపాలు, క్షేత్రస్థాయిలో చైనా ఇంజనీర్ల సాంకేతిక సహకారం అందిందని పేర్కొంది. 2020-24 మధ్య పాక్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 81 శాతం చైనా నుంచే వచ్చాయని వెల్లడించింది.
పాకిస్థాన్‌తో చైనా పెంచుకుంటున్న సైనిక భాగస్వామ్యం, వాస్తవాధీన రేఖ వెంబడి మౌలిక సదుపాయాల విస్తరణ, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఒత్తిడి వల్ల భారత్‌కు ఏకకాలంలో రెండు వైపుల నుంచి ముప్పు ఎదురయ్యే ప్రమాదం పెరిగిందని కాంగ్రెస్ ప్యానెల్ నివేదికలో హెచ్చరించింది. కేవలం సైనికపరంగానే కాకుండా, పారిశ్రామిక సరఫరాలపై ఆంక్షలు విధించడం, హిందూ మహాసముద్రంలో నౌకాదళ ఉనికిని పెంచడం ద్వారా కూడా భారత్ ఎదుగుదలను నియంత్రించేందుకు బీజింగ్ ప్రయత్నిస్తోందని పేర్కొంది.
అమెరికా-భారత్ సహకారానికి పిలుపు
భారత్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోన్న చైనా వ్యూహాలను తిప్పికొట్టేందుకు అమెరికా, భారత్ మధ్య నిఘా సమాచార మార్పిడి, సముద్ర భద్రత తయారీ రంగాల్లో మరింత లోతైన సహకారం అవసరమని కమిషన్ నొక్కి చెప్పింది. అయితే, భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విధానానికి కట్టుబడి ఉంటుందని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది.
పహల్గాం ఉగ్రదాడి
2025, ఏప్రిల్ 22.. భారత దేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ప్రకృతి అందాలకు నిలయమైన జమ్ము కాశ్మీర్లో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యేలా ఉగ్రదాడి జరిగింది. బైసరన్ మైదానం ప్రాంతంలోని పహల్గాంలో ప్రకృతి అందాలు వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఉగ్రవాదుల తూటాలకు 26 మంది టూరిస్టులు బలయ్యారు. కేవలం ఒక వర్గానికి చెందిన వారినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు.
ఆపరేషన్ సిందూర్
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసేందుకు 2025, మే 10న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ భారత సైన్యం దాడులు చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ కకావికలమై ఇండియాతో కాళ్ల బేరానికి వచ్చింది.
