మ్యూజియంగా ఇటలీలోని సోనియా గాంధీ నివాసం.. రంగంలోకి సిక్కు వ్యాపారవేత్త

మ్యూజియంగా ఇటలీలోని సోనియా గాంధీ నివాసం.. రంగంలోకి సిక్కు వ్యాపారవేత్త

న్యూఢిల్లీ: ఇటలీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టి పెరిగిన ఆమె నివాసం త్వరలో మ్యూజియంగా మారనుంది. ఇటలీలో స్థిరపడిన సిక్కు వ్యాపారవేత్త సుఖ్‌దేవ్ సింగ్ కాంగ్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆరేళ్ల క్రితమే ఈ ఆస్తిని కొనుగోలు చేసిన ఆయన ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయి మ్యూజియంగా అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇటలీలోని విసెంజా ప్రావిన్స్‌లో ఉన్న లూసియానా గ్రామంలో ఈ ఆరు గదుల ఇల్లు ఉంది. ప్రస్తుతం ఈ ఇంటికి 'ఇండియన్ హౌస్' అని పేరు పెట్టారు. ఇంటి బయట భారత త్రివర్ణ పతాకంతో పాటు 'సోనియా గాంధీ జన్మస్థలం' అని రాసి ఉన్న నేమ్‌ప్లేట్‌ను కూడా ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ 1946, డిసెంబర్ 9న ఇక్కడే జన్మించారని, ఆమె బాల్యం అంతా ఈ గ్రే‎స్టోన్ భవనంలోనే గడిచిందని సుఖ్‌దేవ్ తెలిపారు.

ఎవరీ సుఖ్‎దేవ్..?

పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాకు చెందిన సుఖ్‌దేవ్ 1992లో ఇటలీకి వలస వెళ్లారు. అక్కడ తొలినాళ్లలో డెయిరీ ఫామ్, వ్యవసాయ రంగం, ఫ్యాక్టరీల్లో పని చేసిన ఆయన.. ఆ తర్వాత వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. 2020లో తన భార్య, కుమార్తె పేరు మీద సోనియా గాంధీ ఇంటిని కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమృత్‌సర్ సందర్శనలో ఉన్న సుఖ్‌దేవ్, ఫోన్ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.

గాంధీ కుటుంబానికి అభిమానులం

"ప్రస్తుతం ఈ ఇంటి పర్యవేక్షణ కోసం ఒక కేర్‌టేకర్‌ను నియమించాం. ఎవరైనా పర్యాటకులు ఇల్లు చూడాలనుకుంటే కేర్‌టేకర్ అనుమతిస్తారు. ఆస్తి పన్ను, ఇతర మెయింటెనెన్స్ కోసం ఏటా సుమారు 1,000 యూరోలు ఖర్చు చేస్తున్నాను" అని సుఖ్‌దేవ్ చెప్పారు. తమ కుటుంబం గాంధీ కుటుంబానికి అభిమానులమని, ప్రతి ఏటా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను అక్కడ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

మ్యూజియం ఏర్పాటుకు సంబంధించి సోనియా గాంధీ లేదా ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంకలను కలిసి మాట్లాడాలని సుఖ్‌దేవ్ భావిస్తున్నారు. మ్యూజియంలో ప్రదర్శించడానికి ఆమెకు సంబంధించిన పాత ఫోటోలు, పత్రాలు లేదా ఇతర జ్ఞాపకాలను సేకరించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇవి దొరికితేనే ప్రాజెక్టు తదుపరి దశకు చేరుతుందని ఆయన వివరించారు.

"ఈ ఇంటిని అద్దెకు ఇవ్వాలని లేదా గురుద్వారాగా మార్చాలని గతంలో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. కానీ సోనియా గాంధీకి, మెయినో కుటుంబానికి ఈ ఇంటితో ఉన్న చారిత్రక అనుబంధాన్ని కాపాడాలన్నదే మా ఉద్దేశం" అని సుఖ్‌దేవ్ స్పష్టం చేశారు. ఈ మ్యూజియం అందుబాటులోకి వస్తే ఇటలీని సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, తద్వారా స్థానిక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సోనియా గాంధీ ఇటీవల రాసిన 'బిలాంగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' అనే పుస్తకం విడుదలైన నేపథ్యంలో, ఆమె బాల్యం, ఇటలీలో గడిపిన రోజుల పట్ల పర్యాటకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే మ్యూజియం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని సుఖ్‌దేవ్ నిర్ణయించుకున్నారు.