వైశాలి (బీహార్): బీహార్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ కానుక అందించింది. గంగానదిపై నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆరు లైన్ల వంతెన నితీష్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (నవంబర్ 21) ప్రారంభించారు. వైశాలి జిల్లాలోని కచ్చీ దర్గా-రాఘోపూర్-బిదుపూర్ మధ్య నిర్మించిన ఈ వంతెనకు మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు పెట్టారు.
వంతెన ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ చౌదరితో కలిసి కొద్దిసేపు వంతెనపై నడిచారు. ఈ సందర్భంగా ప్రజలకు గమ్చా (తువ్వాలు) ఊపుతూ అభివాదం చేశారు.
రూ.4,280 కోట్లతో నిర్మాణం
గంగానదిపై నిర్మించిన ఈ నితీష్ సేతు ఎక్స్‌ట్రాడోస్డ్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జి. ఈ ప్రాజెక్టును సుమారు రూ.4,280 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొత్తం 19.7 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టులో 9.7 కిలోమీటర్ల ప్రధాన వంతెనతో పాటు మరో 10 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్లు ఉన్నాయి.
పట్నా జిల్లాలోని కచ్చీ దర్గా వద్ద NH-22 నుంచి వైశాలి జిల్లాలోని బిదుపూర్ వద్ద NH-322 వరకు ఈ వంతెన అనుసంధానం కల్పిస్తుంది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో పట్నా నుంచి వైశాలికి ప్రయాణ సమయం 20 నుంచి 25 నిమిషాలకు తగ్గనుంది.
మహాత్మా గాంధీ సేతుపై ట్రాఫిక్ తగ్గింపు
ఇప్పటివరకు గంగానదిని దాటేందుకు ప్రధానంగా మహాత్మా గాంధీ సేతు, జేపీ సేతుపై ఆధారపడుతున్న వాహనదారులకు నితీష్ సేతు మరో ప్రత్యామ్నాయంగా మారనుంది. దీంతో ఈ రెండు వంతెనలపై ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ఉత్తర, దక్షిణ బీహార్ ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.ముఖ్యంగా రాఘోపూర్ దియారా ప్రాంత ప్రజలకు ఈ వంతెన ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. పట్నాకు త్వరగా చేరుకోవడంతో పాటు వైద్యం, విద్య వంటి అత్యవసర సేవలను సులభంగా పొందే అవకాశం కలుగుతుంది.
ఈ వంతెన ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువుల రవాణా సులభతరం కానుంది. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించవచ్చు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరిగి ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును లార్సెన్ అండ్ టూబ్రో (L&T), దక్షిణ కొరియాకు చెందిన డేవూ సంస్థల జాయింట్ వెంచర్ నిర్మించింది.
నితీష్ కుమార్‌తో మోదీ ఆత్మీయ భేటీ
బీహార్ పర్యటనలో భాగంగా పట్నా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌తో పాటు ఎన్డీఏ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్‌ను ఆప్యాయంగా పలకరించిన మోదీ.. ఆయనతో దిగిన ఫొటోలను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.పట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్ జీని కలవడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ ప్రధాని తన పోస్టులో తెలిపారు.
బీహార్‌కు రూ.34,470 కోట్ల అభివృద్ధి పనులు
ఈ పర్యటనలో భాగంగా బీహార్‌లో సుమారు రూ.34,470 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. రోడ్లు, విద్యుత్, పట్టణ మౌలిక సదుపాయాలు, నీటి వనరులు, విద్య, వైద్యం, రవాణా రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.జాఫర్పట్టి ప్రాంతంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో రూ.15,600 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనుండగా, సుమారు రూ.14,450 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు.
