167 ఏళ్ల నాటి గణిత చిక్కుముడిని విప్పిన ఏఐ.. ‘రీమాన్ హైపోథెసిస్’ పరిష్కరించామన్న ఆంత్రోపిక్

167 ఏళ్ల నాటి గణిత చిక్కుముడిని విప్పిన ఏఐ.. ‘రీమాన్ హైపోథెసిస్’ పరిష్కరించామన్న ఆంత్రోపిక్

167 ఏళ్లుగా గణిత శాస్త్రవేత్తలను వెంటాడుతున్న అత్యంత కష్టమైన సమస్య 'రీమాన్ హైపోథెసిస్'ను సాల్వ్ చేసినట్లు అమెరికన్ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆంత్రోపిక్ కంపెనీకి చెందిన క్లాడ్ ఏఐ మోడల్ సాయంతో ఈ చిక్కుముడిని విప్పినట్లు ఆ సంస్థ శాస్త్రవేత్త లేవంట్ ఆల్పోగ్ వెల్లడించారు.

దీనికి సాక్ష్యంగా ఆయన కోటి 70 లక్షల లైన్ల కంప్యూటర్ కోడ్‌ను విడుదల చేశారు. జర్మనీకి చెందిన గణిత శాస్త్రవేత్త బెర్న్‌హార్డ్ రీమాన్ 1859లో ఈ సమస్యను ప్రపంచం ముందుకు తెచ్చారు. ఇది ప్రధానంగా అభాజ్య సంఖ్యల (Prime Numbers - 2, 3, 5, 7, 11...) అమరిక, వాటి సరళికి సంబంధించినది. గణిత శాస్త్రంలో ఈ సంఖ్యలనే మిగతా అన్ని నంబర్లకు పునాదిగా భావిస్తారు. గత ఒకటిన్నర శతాబ్దానికి పైగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులు దీనిని నిరూపించడానికి ప్రయత్నించారు.

రీమాన్ హైపోథెసిస్‌తో పాటు దానికంటే క్లిష్టమైన ‘జనరలైజ్డ్ రీమాన్ హైపోథెసిస్’ను కూడా పరిష్కరించినట్లు ఆల్పోగ్ పేర్కొన్నారు. సాధారణంగా శాస్త్రవేత్తలు ఇలాంటి పరిశోధనల కోసం రీసెర్చ్ పేపర్లను ప్రచురిస్తారు. కానీ ఆల్పోగ్ ఏకంగా కోటి 70 లక్షల లైన్ల కంప్యూటర్ కోడ్‌ను విడుదల చేయడం విశేషం. అయితే ఏఐ మోడల్ ఈ పరిష్కారాన్ని ఎలా కనుగొందనే విషయాన్ని తాను కూడా ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానని అంగీకరించారు.

ఆల్పోగ్ చేసిన ఈ క్లెయిమ్‌పై ఇప్పటికే గణిత ప్రపంచంలో చర్చ మొదలైంది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఆండ్రూ సదర్లాండ్ సహా పలువురు నిపుణులు ఈ కోడ్‌ను పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా నిర్వహించిన పరీక్షల్లో ఈ కోడ్ సరైనదిగానే ఉన్నట్లు వారు గుర్తించారు. గణిత సమస్యలను ధృవీకరించే రెండు వేర్వేరు కంప్యూటర్ సిస్టమ్స్ కూడా ఈ పరిష్కారాన్ని సమర్థించాయి.

క్లే మ్యాథమెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించిన ప్రపంచంలోని 7 అత్యంత కష్టమైన సమస్యల్లో (మిలీనియం ప్రైజ్ ప్రాబ్లమ్స్) రీమాన్ హైపోథెసిస్ ఒకటి. దీనిని విజయవంతంగా పరిష్కరించి.. నిరూపిస్తే సుమారు రూ.9 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. అయితే ఈ బహుమతి దక్కాలంటే కఠినమైన నిబంధనలు ఉంటాయి. రాబోయే కొద్ది నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణిత శాస్త్రవేత్తలు ఈ 1.7 కోట్ల లైన్ల కోడ్‌ను నిశితంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ ముగిసి అధికారికంగా ధృవీకరణ రావడానికి కనీసం 2 నుంచి 3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

ప్రపంచంలోని ఆ 7 కష్టమైన సమస్యల్లో ఇప్పటివరకు కేవలం ఒకదానికి మాత్రమే పరిష్కారం దొరికింది. దానిని 2002లో ఓ మానవ మేధావి సాధించారు. కాగా ఇటీవల ఓపెన్ ఏఐ కూడా ‘నేవియర్-స్టోక్స్’ అనే మరో కష్టమైన సమస్యను తమ ఏఐ పరిష్కరించిందని ప్రకటించింది. ఇప్పుడు ఆంత్రోపిక్ క్లెయిమ్ కూడా నిజమైతే.. ఏఐ సాయంతో పరిష్కారమైన సమస్యల సంఖ్య మూడుకు చేరుతుంది. ఈ పరిష్కారాల వల్ల భవిష్యత్తులో క్వాంటం ఫిజిక్స్, ఆధునిక విజ్ఞాన రంగాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.