అమెరికా టాప్ 10 మోస్ట్ వాంటెడ్ లిస్ట్‎లో గోల్డీ బ్రార్.. పట్టిస్తే రూ.8.5 కోట్లు

అమెరికా టాప్ 10 మోస్ట్ వాంటెడ్ లిస్ట్‎లో గోల్డీ బ్రార్.. పట్టిస్తే రూ.8.5 కోట్లు

వాషింగ్టన్: నోటోరియస్ గ్యాంగ్‌స్టర్ సతీందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) తమ టాప్-10 మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో చేర్చింది. అలాగే, గోల్డీ బ్రార్  ఆచూకీ తెలియజేసిర వారికి1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8.4 కోట్లు) భారీ నజరానా ప్రకటించింది. గ్యాంగ్‎స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు ఉత్తర అమెరికాలో బ్రార్ నాయకత్వం వహిస్తున్నట్లు ఎఫ్‎బీఐ అధికారులు తెలిపారు.

అమెరికా, కెనడాల్లో హత్యలు, వసూళ్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాలకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది. గోల్డీ బ్రార్ కోసం అమెరికా, కెనడా భద్రతా సంస్థలు సంయుక్తంగా గాలిస్తున్నాయి. కెనడా ప్రభుత్వం కూడా బ్రార్ అరెస్టు కోసం గతంలోనే 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ.2.1 కోట్లు) రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. కెనడా మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో బ్రార్ మొదటి స్థానంలో ఉన్నాడు.

భారత జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‎కి బ్రార్ ప్రధాన అనుచరుడని ఎఫ్‌బీఐ పేర్కొంది. బిష్ణోయ్ జైలు నుంచే మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తుండగా, బ్రార్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ ముఠా ముఖ్యంగా భారత్ తో పాటు విదేశాల్లో ఉన్న భారతీయ సంతతి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతోందని దర్యాప్తు సంస్థలు తెలిపాయి.

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో 2023, జూన్ 18న ఒక సిక్కు ఆలయం వద్ద ‘హెచ్.ఎస్.ఎన్’ అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఈ హత్య బిష్ణోయ్, బ్రార్ ఆదేశాల మేరకే జరిగినట్లు అమెరికా ఫెడరల్ కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. అలాగే, 2023 సెప్టెంబర్‌లో విన్నిపెగ్‌లో సుఖ్‌దూల్ సింగ్ గిల్ అలియాస్ సుఖా దునేకే హత్య కేసులోనూ బ్రార్‌పై కెనడా పోలీసులు వారెంట్ జారీ చేశారు.

అమెరికాలో ‘ఆపరేషన్ హార్డ్‌బాల్’ పేరుతో చేపట్టిన సుదీర్ఘ దర్యాప్తులో ఈ ముఠా ఆగడాలు బయటపడ్డాయి. మార్చి 2024 నుంచి జూలై 2025 మధ్య కాలంలో లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ప్రత్యర్థి ముఠాల నుంచి సుమారు 520 కిలోల కొకైన్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు దొంగిలించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని అరెస్ట్ చేయగా, బ్రార్ సహా ఐదుగురు పరారీలో ఉన్నారు.

గోల్డీ బ్రార్ కాలిఫోర్నియా లేదా కెనడాలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుని ఉండవచ్చని ఎఫ్‌బీఐ భావిస్తోంది. అతను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, ఆయుధాలు కలిగి ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు నేరుగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. బ్రార్ గురించి సమాచారం తెలిసిన వారు ఎఫ్‌బీఐ వెబ్‌సైట్ ద్వారా లేదా సమీపంలోని అమెరికా రాయబార కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.