ఇందిరమ్మ బీమా మార్గదర్శకాలు రిలీజ్.. కుటుంబానికి రూ.5 లక్షల బీమా! ఎవరెవరు అర్హులంటే?

ఇందిరమ్మ బీమా మార్గదర్శకాలు రిలీజ్.. కుటుంబానికి రూ.5 లక్షల బీమా! ఎవరెవరు అర్హులంటే?

హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ బీమా పథకం నమోదుకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. అయితే ఒక రేషన్ కార్డుపై కుటుంబంలో ఒక్కరికి మాత్రమే బీమా పొందే అవకాశం ఉంటుంది.

కుటుంబంలో ఒక్కరికే బీమా

ఇందిరమ్మ బీమా పథకంలో ఒక కుటుంబానికి ఒకరిని మాత్రమే బీమా కోసం నమోదు చేస్తారు. రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అయితే బీమా పొందే వ్యక్తి ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనే అవకాశం కల్పించారు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీ లేదా నామినీలకు రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుంది.

18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి అర్హత

ఈ పథకానికి 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. అంటే 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించిన వారు ఇందిరమ్మ బీమా పథకంలో నమోదు చేసుకోవచ్చు. లబ్ధిదారుల వయస్సును నిర్ధారించేందుకు ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకోనున్నారు.

ఆధార్‌లో పుట్టిన తేదీ విషయంలో కీలక నిబంధనలు

ఆధార్ కార్డులో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే నమోదై ఉంటే, సంబంధిత సంవత్సరం జూలై 1వ తేదీని పుట్టిన తేదీగా పరిగణిస్తారు. ఒకవేళ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా నమోదై ఉంటే, ముందుగా గుర్తింపు పొందిన ఆధార్ కేంద్రానికి వెళ్లి వివరాలను సరిచేసుకోవాలి. ఆ తర్వాతే ఇందిరమ్మ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నెల రోజుల పాటు ప్రత్యేక నమోదు శిబిరాలు

అర్హులైన వారందరికీ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం నెల రోజుల పాటు ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహించనుంది. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఆధారంగా నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. నమోదు సమయంలో వివరాల్లో తప్పులు ఉన్నాయనే కారణంతో దరఖాస్తులను వెనక్కి పంపవద్దని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం.

అర్హులు ఈ విషయాలు గుర్తుంచుకోండి

  • ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.
  • ఒక రేషన్ కార్డుకు ఒక్కరికే బీమా అవకాశం.
  • 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు అర్హులు.
  • 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించి ఉండాలి.
  • ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను నమోదు చేసుకోవచ్చు.
  • బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు.
  • ఆధార్, మొబైల్ నంబర్‌తో నమోదు.
  • నెల రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు.