ఆధ్యాత్మికం: ఇతరులను నిందించారా.. ప్రాణాలు తీసినట్లే.. కురుక్షేత్రమే దీనికి నిదర్శనం..!

ఆధ్యాత్మికం: ఇతరులను నిందించారా.. ప్రాణాలు తీసినట్లే.. కురుక్షేత్రమే దీనికి నిదర్శనం..!

ప్రతి మానవుడు తన జీవితంలో ఏదో ఒక సమయంలో ఆవేశానికి, కోపానికి గురవుతాడు. ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. తెలిసి చేసినా, తెలియక చేసినా.. చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితిలో కూడా రెండు తప్పులు ఎప్పుడూ చేయకూడదని పండితులు చెబుతున్నారు.

మానవుడు జీవితంలో రెండు తప్పులు ఎప్పుడూ చేయకూడదు అని పండితులు చెబుతారు.


1. ఆత్మస్తుతి - తనను తాను పొగుడుకోవడం
2. పరనింద - ఇతరులను నిందించడం

ఈ రెండూ చాలా పెద్ద తప్పులు.

 దేవతలకు అధిపతి అయిన దేవేంద్రుడు కూడా తన గొప్పతనాన్ని తానే చెప్పుకుంటే చాలా చులకన అవుతాడు. మరి సామాన్య మానవుడి పరిస్థితి ఏమిటి? అందుకే ఎంత గొప్పవాడైనా తనను ఇతరులు పొగడాలి కానీ, తనను తాను పొగుడుకోకూడదు.ఇక రెండోది పరనింద. ఇతరులను నిందించడం ఒక మనిషిని హత్య చేయడం కంటే ఎక్కువ పాపం అని శాస్త్రం చెబుతుంది. దీనికి మహాభారతంలోనే గొప్ప ఉదాహరణ ఉంది.

"ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః"

కురుక్షేత్రంలో ఏం జరిగింది?

కురుక్షేత్ర సంగ్రామంలో 17వ రోజు యుద్ధం భీకరంగా సాగుతోంది. కర్ణుడి ధాటికి ధర్మరాజు తట్టుకోలేకపోయాడు. కర్ణుడి బాణాలకు గాయపడి, అలసిపోయి యుద్ధభూమి నుంచి వెనుదిరిగి శిబిరానికి వెళ్లిపోయాడు.యుద్ధభూమిలో అన్నయ్య కనిపించకపోవడంతో అర్జునుడు కంగారు పడ్డాడు. ధర్మరాజు ఎక్కడా కనిపించక వెతికి వెతికి చివరకు  తాను కూడా శిబిరానికి చేరుకున్నాడు. .శిబిరంలో అర్జునుడిని చూసిన ధర్మరాజు కోపంతో.. "కర్ణుడిని చంపావా.. లేదా?" అని ప్రశ్నించాడు."లేదు అన్నయ్యా.. నిన్ను వెతుకుతూ వచ్చాను" అని అర్జునుడు సమాధానం ఇచ్చాడు.అప్పుడు ఆవేశంలో ధర్మరాజు అన్న మాటలు అర్జునుడి మనసును గాయపరిచాయి.

కర్ణుడిని చంపలేకపోతే నీకు గాండీవం ఎందుకు.. దండగ.. దానిని ఎవరికైనా దానం చేసేయ్.."

ఆ మాటలు వినగానే అర్జునుడి రక్తం ఉడికిపోయింది. ఎందుకంటే అర్జునుడు ముందే ఒక శపథం చేశాడు. 
"నా గాండీవాన్ని విడిచిపెట్టమని చెప్పిన వారిని చంపుతాను" అని.

ఇప్పుడు ఆ మాట అన్నది సాక్షాత్తు తన అన్నయ్య ధర్మరాజు. శపథం నెరవేర్చాలంటే అన్నయ్యను చంపాలి. చంపకూడదంటే శపథం భంగం అవుతుంది. ఏం చేయాలో తెలియక అర్జునుడు సంక్షోభంలో పడ్డాడు. వెంటనే శ్రీకృష్ణుడి వైపు చూసి.. "కృష్ణా.. నా శపథాన్ని ఎలా నెరవేర్చుకోవాలి? అగ్రజుడిని చంపడం ఎలా?" అని ప్రశ్నించాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు  నవ్వుతూ ఇలా అన్నాడు.."అర్జునా.. ధర్మరాజు వంటి మహాపురుషుడిని చంపాలనుకోవడమే మహాపాపం. కానీ నీ శపథాన్ని నెరవేర్చాలి కదా.. అయితే ఒక పని చెయ్. నీవు ధర్మరాజును కారణం లేకుండా నిందించు. ఆయనను అవమానించు. అలా నిందించడమంటే  ఆయనను హత్య చేసినట్లు అవుతుంది."శ్రీకృష్ణుడి మాట ప్రకారం అర్జునుడు ధర్మరాజును నిందించాడు. దానితో అతని శపథం నెరవేరినట్లు అయ్యింది. ఆ తర్వాత అర్జునుడు తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరాడు. ధర్మరాజు కూడా తన తప్పు తెలుసుకుని అర్జునుడిని క్షమించాడు.

అందుకు ఒక వ్యక్తిని నిందించడం అంటే అతడిని హత్య చేయడం కంటే ఘోరమైన పాపం. ఎందుకంటే శరీరాన్ని చంపితే ఆ ఒక్క జన్మ పోతుంది. కానీ నిందతో ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ట, మనశ్శాంతి మొత్తం చంపేస్తాం.ఇంకా మనల్ని మనం పొగుడుకోవడం మానేయాలి.ఇతరులను నిందించడం మానేయాలి.ఈ రెండు తప్పులు చేయకుండా ఉంటే చాలు.. జీవితంలో సగం పాపాల నుంచి బయటపడినట్లేనని మహాభారతం ద్వారా తెలుస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.