అమెరికాలో H-1B వీసా నిబంధనలు కఠినతరం కావడం, గ్రీన్ కార్డు లభించడంలో అనిశ్చితి నెలకొనడంతో ఐటీ నిపుణులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా నిబంధనల్లో వస్తున్న వరుస మార్పులు, పెరిగిన ఫీజులు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల భారతీయుడు యశ్ శర్మ వంటి వారు అమెరికాను వదిలి బ్రిటన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
గడిచిన ఆరేళ్లుగా హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉంటున్న శర్మ.. అక్కడ శాశ్వత నివాసానికి గ్రీన్ కార్డ్ లభించే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "అమెరికా నాకు ఒక బంగారు పంజరంలా అనిపిస్తోంది" అని పేర్కొన్నారు. ఉద్యోగం లేకపోయినా బ్రిటన్ ప్రభుత్వం 'గ్లోబల్ టాలెంట్' వీసా ద్వారా అక్కడ స్థిరపడేందుకు స్పష్టమైన మార్గాన్ని చూపడంతో వచ్చే నెలలో అమెరికా నుంచి అక్కడికి వెళ్లనున్నారు.
ఐటీ రంగంలోని దిగ్గజ సంస్థలు కూడా వీసా నిబంధనల వల్ల తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ప్రముఖ టెక్ సంస్థ ఐబీఎం తన ప్రధాన విభాగాల్లో విదేశీ ఉద్యోగులకు వీసా స్పాన్సర్‌షిప్ నిలిపివేయాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రభావితమైన ఉద్యోగులు అమెరికా వెలుపల ఉన్న ఐబీఎం కార్యాలయాలకు బదిలీ కావాలని లేదా ఈ ఏడాది చివరికల్లా కంపెనీని వదిలి వెళ్లాలని సూచించింది.
చెల్లింపుల సంస్థ ఫ్లైవైర్ కూడా పెరిగిన వీసా ఖర్చుల దృష్ట్యా తమ నియామకాలను ఇతర దేశాలకు తరలించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలు గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ఫెడరల్ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నాయి. నిపుణులైన విదేశీయులను తాత్కాలికంగా తీసుకునేందుకు ఉద్దేశించిన వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, దీనివల్ల అమెరికన్ల వేతనాలు తగ్గుతున్నాయని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది.
ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రభావం గణాంకాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఫెడరల్ డేటా ప్రకారం.. గతేడాది కంటే సుమారు 2లక్షల 60వేలు తక్కువ సంఖ్యలో తాత్కాలిక వీసాలు జారీ అయ్యాయి. అమెరికా యూనివర్సిటీల్లో కొత్తగా చేరుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా 15 శాతం తగ్గింది. చదువు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు పనిచేసుకునేందుకు ఉద్దేశించిన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(OPT) ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారి సంఖ్యలో ఐదేళ్లలో మొదటిసారిగా 6 శాతం తగ్గుదల నమోదైంది.
నిబంధనలు కఠినతరం కావడం వల్ల కంపెనీలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కొత్తగా హెచ్-1బీ వీసా దరఖాస్తు కోసం లక్ష డాలర్ల ఫీజును ప్రభుత్వం ప్రతిపాదించింది. కఠినమైన రూల్స్ తో ఉద్యోగ ఆధారిత వలస వ్యవస్థను ప్రభుత్వం నిశ్శబ్దంగా నిర్వీర్యం చేస్తోందని అక్కడి న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలో నెలకొన్న ఈ అనిశ్చితి వల్ల నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు ఇతర దేశాలకు తరలిపోతున్నారని.. ఇది దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ వంటి దేశాల నుంచి వచ్చే నిపుణులకు గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ ఎక్కువగా ఉండటం వల్ల అమెరికాలో స్థిరపడటం కష్టతరంగా మారుతోంది.
