Salman Khan : టాలీవుడ్‌పై సల్మాన్ ఖాన్ మనసు.. ఆ నలుగురు హీరోలతో సినిమా చేయడానికి రెడీ!

Salman Khan : టాలీవుడ్‌పై సల్మాన్ ఖాన్ మనసు.. ఆ నలుగురు హీరోలతో సినిమా చేయడానికి రెడీ!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ టాలీవుడ్ పై మనసు పారేసుకున్నారు. తెలుగు సినిమాలంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని చెప్పారు.  టాలీవుడ్ అగ్ర కథనాయకులతో కలిసి నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి పిలుపు వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెబుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో టాలీవుడ్ లో సల్మాన్ ఎంట్రీపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

లేటెస్ట్ గా హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్‌కు తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వస్తే అంగీకరిస్తారా? అని ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ... టాలీవుడ్‌లో తనకు మంచి స్నేహితులు ఉన్నారని, వారితో కలిసి పనిచేయడం తనకు సంతోషమేనని చెప్పారు. చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తనను సినిమా కోసం పిలిస్తే తప్పకుండా భాగమవుతానని స్పష్టం చేశారు. దీంతో ఈ నలుగురు హీరోల్లో ఎవరు ముందుగా సల్మాన్‌ను తమ సినిమాలోకి తీసుకొస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఇక మీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు? అన్న ప్రశ్నకు సల్మాన్ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. 'నేనే నా ఫేవరెట్ తెలుగు హీరో కావాలనుకుంటున్నాను' అంటూ చమత్కరించారు.  నిజానికి సల్మాన్‌కు టాలీవుడ్‌తో ఇప్పటికే మంచి అనుబంధం ఉంది. చిరంజీవి నటించిన 'గాడ్‌ఫాదర్'లో ప్రత్యేక పాత్రలో మెరిసిన ఆయన.. రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మరోవైపు 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'లో చరణ్ అతిథి పాత్రలో సందడి చేశారు. అల్లు అర్జున్ 'సీటీ మార్' పాటకు 'రాధే'లో చోటివ్వడం కూడా తెలుగు అభిమానులకు గుర్తుండే ఉంటుంది.

ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలతో తెలుగు హీరోలు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ సృష్టించారు. ఈ నేపథ్యంలో సల్మాన్ లాంటి బాలీవుడ్ సూపర్‌స్టార్ తెలుగు సినిమాలో పూర్తిస్థాయి పాత్రలో కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం నమోదవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ నలుగురిలో సల్మాన్‌కు ముందుగా ఎవరు ఆఫర్ ఇస్తారో చూడాలి..