హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లపై.. బైక్, కార్ల డీలర్లకు రవాణా శాఖ వార్నింగ్

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లపై.. బైక్, కార్ల డీలర్లకు రవాణా శాఖ వార్నింగ్

హైదరాబాద్: తెలంగాణలో కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (HSRP) విషయంలో రవాణా శాఖ  హెచ్చరిక జారీ చేసింది. వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లు కేటాయించినప్పటికీ కొందరు డీలర్లు HSRP ప్లేట్లు అమర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో  పెండింగ్‌లో ఉన్న వాహనాలకు ఏడు రోజుల్లోగా HSRP ప్లేట్లు అమర్చి, వివరాలను వాహన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని డీలర్లను ఆదేశించింది.

1.54 లక్షల వాహనాలకు HSRP పెండింగ్

రాష్ట్రంలో వాహన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ పెద్ద సంఖ్యలో వాహనాలకు HSRP ప్లేట్లు అమర్చలేదని రవాణా శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,10,330 వాహనాలు రిజిస్టర్ కాగా  వీటిలో 4,56,298 వాహనాలకు మాత్రమే డీలర్లు HSRP ప్లేట్లు అమర్చారు. మరో 1,54,032 వాహనాలకు HSRP అమర్చాల్సి ఉంది. ఈ పెండింగ్ అంశాన్ని రవాణా శాఖ తీవ్రంగా పరిగణించింది.

HSRP లేకపోతే RC కార్డు ప్రింట్ కాదు!

వాహనాలకు HSRP అమర్చిన వివరాలను వాహన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసిన తర్వాతే RC కార్డు ప్రింట్ అవుతుంది. డీలర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో పెద్ద సంఖ్యలో వాహన యజమానులకు RC కార్డులు అందడం లేదు. దీనివల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డీలర్లకు 7 రోజుల గడువు

కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు, 1989లోని రూల్ 50 ప్రకారం వాహన తయారీదారులు, డీలర్లు HSRP ప్లేట్లను తప్పనిసరిగా అమర్చాలి. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రింగ్ అథారిటీలకు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ వాహనాల వివరాలను డీలర్ వారీగా సమీక్షించి, ఏడు రోజుల్లోగా HSRP అమర్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు

HSRP ప్లేట్లు అమర్చడంలో నిర్లక్ష్యం వహించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇందుకోసం షోకాజ్ నోటీసులు జారీ చేయడం, జరిమానాలు విధించడం, ట్రేడ్ సర్టిఫికెట్లను సస్పెండ్ చేయడం, వాహన్ పోర్టల్‌లో డీలర్ లాగిన్‌ను బ్లాక్ చేయడం వంటి చర్యలు చేపట్టనున్నారు.

వాహనదారులకు సూచన

కొత్త వాహనాలకు HSRP ప్లేట్లు అమర్చడం, వాటి వివరాలను వాహన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయడం డీలర్ల బాధ్యత. HSRP ప్లేట్లు లేదా RC కార్డు ఇంకా అందని వాహన యజమానులు సంబంధిత డీలర్‌ను లేదా సమీప RTA కార్యాలయాన్ని సంప్రదించాలని రవాణా శాఖ సూచించింది.