న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు అభియోగాలను ఖరారు చేసింది. 2026, నవంబర్ 25 నుంచి ఈ కేసులో రోజువారీ విచారణ ప్రారంభం కానుంది. సీబీఐ ఈ కేసులో సుమారు 20 వేల పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. అయితే, నిందితులందరూ తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
అసలేం జరిగిందంటే..?
2026, మే 3జరిగిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 20 లక్షల మందికి పైగా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేసింది. నీట్ పేపర్ లీక్ కేసు విచారణను కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును సీబీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారించింది.
ఎన్టీఏ ప్రశ్నాపత్రాల తయారీలో పాల్గొన్న ప్రొఫెసర్లు ప్రహ్లాద్ కులకర్ణి, మనీషా మాంధరే, మనీషా సంజయ్ పేపర్ లీక్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసులో మొత్తం 14 మందిపై సీబీఐ కేసు నమోదు చేసి దాదాపు 20 వేల పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. మొదట 13 మందిపై ఛార్జ్‌షీట్ వేయగా, ఆ తర్వాత మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన 14వ నిందితుడు శేషారావ్ బజరంగ్ సూర్యవంశీపై సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఈ క్రమంలోనే 14 మంది నిందితులపై న్యాయస్థానం అధికారికంగా అభియోగాలు నమోదు చేసింది. 2026, నవంబర్ 25 నుంచి కోర్టు ఈ కేసు రోజు వారీ విచారణ చేపట్టింది. నిందితులందరూ తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ విచారణ దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యార్థులకు అత్యంత కీలకం కానుంది.
