కార్తీకమాసం శుక్ల పక్షం ద్వాదశి రోజున తులసీ కళ్యాణం తరువాత .. మానవులు పెళ్లిళ్లు చేసుకుంటారు. ముహూర్తాలు కూడా అప్పుడే ఉంటాయి. తులసీకళ్యణానికి.. మానవుల వివాహాలకు సంబంధం ఏమిటి.. శాలిగ్రామస్వామి ( విష్ణుమూర్తి).. తులసీ మాతకు ఎందుకు కళ్యాణం చేసుకున్నారు. పురాణాల్లో ఏముంది.. పండితులు ఏం చెబుతున్నారు. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
కార్తీకమాసం దేవుత్తాన ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. ఇక ద్వాదశి రోజున మానవులకు ఉద్దరించేందుకు.. సాలిగ్రామరూపంలో ఉన్న విష్ణుమూర్తి తులసీమాతను పెళ్లి చేసుకుంటాడని పండితులు చెబుతున్నారు. ఆ తరువాతే పెళ్లి ముహూర్తాలు ఉంటాయి.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథి ( 2026 నవంబర్ 21) రోజున తులసి మాతకు, శాలిగ్రామ స్వామికి వైభవంగా వివాహం జరిపిస్తారు. చాతుర్మాస కాలంలో నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు దేవుత్తాన ఏకాదశి రోజున మేల్కొంటారు. దీంతో శుభకార్యాలకు మళ్లీ శ్రీకారం చుడతారు.
హిందూ పురాణాల ప్రకారం, ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు. దీనిని దేవశయని ఏకాదశి అంటారు. ఆ తర్వాత నాలుగు నెలల పాటు చాతుర్మాసం కొనసాగుతుంది. ఈ సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు చెబుతున్నారు.
అందుకే విష్ణుమూర్తి నిద్రలేచిన మరుసటి రోజే శాలిగ్రామ స్వామి(విష్ణు) తులసిని వివాహం చేసుకున్నారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ వేడుకతరువాతే మానవులు వివాహాలు, ఇతర శుభకార్యాల నిర్వహణకు అనుకూల సమయం ప్రారంభమవుతుంది. అందుకే తులసి వివాహాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు.
విష్ణుమూర్తి.. తులసీ మాతను ఎందుకు పెళ్లి చేసుకున్నారు
పురాణాల ప్రకారం సత్యయుగంలో వృంద అనే గొప్ప పతివ్రత ఉండేది. ఆమె జలంధరుడు అనే రాక్షసుడిని వివాహం చేసుకుంది. వృందకు తన భర్తపై ఉన్న అపారమైన భక్తి, పాతివ్రత్య మహిమ కారణంగా జలంధరుడు అత్యంత శక్తివంతుడిగా మారాడు. దేవతలు సైతం అతడిని ఓడించలేకపోయారు. దీంతో దేవతలంతా శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. లోకకల్యాణం కోసం విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో వృంద వద్దకు వెళ్లి, ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేశారని పురాణ కథనం. దీంతో జలంధరుడి శక్తి తగ్గి, యుద్ధంలో మరణించాడు.
ఈ విషయం తెలుసుకున్న వృంద తీవ్ర ఆగ్రహంతో విష్ణుమూర్తిని శిలగా మారమని శపించింది. అనంతరం ఆమె తన ప్రాణాలను విడిచింది. పతివ్రత శాపం ఎంతటి మహానుభావులైనా అనుభవించాల్సిందే. వృంద త్యాగానికి గుర్తుగా ఆమె బూడిద నుంచి పవిత్రమైన తులసి మొక్క ఆవిర్భవించిందని చెబుతారు.
వృంద కోరిక మేరకు శ్రీమహావిష్ణువు శాలిగ్రామ రూపంలో ఆమెను వివాహం చేసుకుంటానని వరమిచ్చారు. అప్పటి నుంచి కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి, శాలిగ్రామ వివాహం నిర్వహించే సంప్రదాయం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి.
తులసి వివాహం జరిపించడం వల్ల కలిగే ఫలితాలు
- తులసి వివాహం కేవలం ఆచారం మాత్రమే కాదు. ఇందులో కుటుంబ బంధాలు, దాంపత్య జీవితం, భక్తి, పవిత్రత వంటి ఎన్నో ఆధ్యాత్మిక భావాలు ఇమిడి ఉన్నాయి.
- సంతానం లేని దంపతులు తులసి వివాహాన్ని కన్యాదాన సంప్రదాయంలో నిర్వహిస్తే కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.
- తులసి మాత, శాలిగ్రామ స్వామికి వివాహం జరిపించడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని విశ్వసిస్తారు.
- వైవాహిక జీవితంలోని ఆటంకాలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని నమ్ముతారు.
- ఇంట్లో లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభించి, ఐశ్వర్యం, సంతోషం కలుగుతాయని భక్తులు భావిస్తారు.
తులసి మొక్కను అందంగా అలంకరించి, చెరకు గడలతో పందిరి వేసి, పూలు, పసుపు, కుంకుమలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. అనంతరం శాలిగ్రామ స్వామితో తులసి మాతకు సంప్రదాయబద్ధంగా వివాహం జరిపిస్తారు. మంగళహారతులు ఇచ్చి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇలా తులసి వివాహాన్ని జరుపుకోవడం వల్ల ఆ శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
