వెలుగు చీఫ్ ఫోటోగ్రాఫర్ నవీన్‎కు రాష్ట్రస్థాయి అవార్డ్

వెలుగు చీఫ్ ఫోటోగ్రాఫర్ నవీన్‎కు రాష్ట్రస్థాయి అవార్డ్

హైదరాబాద్: ఫోటో జర్నలిస్టులు చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే సాక్షులని, ఒక్క ఫొటోతో చరిత్రను శాశ్వతం చేయగలరని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఒక వార్తను వందల పదాలతో వివరించాల్సి వచ్చినా.. ఒక్క ఫొటో క్షణాల్లోనే వేల భావాలను ప్రజలకు చేరవేస్తుందని పేర్కొన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్ బెస్ట్ ఫోటో జర్నలిస్ట్స్ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

జర్నలిజంలో వార్తకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఫొటోకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందన్నారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, ఉద్యమాలు, యుద్ధాల సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే ఫోటో జర్నలిస్టులు నిజమైన యోధులని కొనియాడారు. ఫేక్ ఫొటోలు, మార్ఫింగ్, ఏఐ సృష్టించిన దృశ్యాలతో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, జర్నలిస్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఫోటో జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఐక్యతతోనే సమస్యలను పరిష్కరించుకోవచ్చని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫోటో జర్నలిస్టులకు అవార్డులు అందజేశారు. V6 వెలుగు చీఫ్ ఫోటోగ్రాఫర్ నవీన్  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా స్టేట్ బెస్ట్ ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డ్‎ను అందుకున్నారు.