కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కలిసి ఆయ నటించిన చిత్రం 'ఓం' ( O.M: Operation Mole ). నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ తొలి రోజే అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించగా.. రెండో రోజు కూడా వసూళ్లతో సత్తా చాటుతోంది. ముఖ్యంగా తమిళ మార్కెట్‌లో సినిమా హవా స్పష్టంగా కనిపిస్తోంది.
సాక్నిల్క్ ట్రేడ్ అంచనాల ప్రకారం.. మొదటి రోజు ఈ సినిమా ఇండియా నెట్ వసూళ్ల రూపంలో రూ.17.70 కోట్లు కొల్లగొట్టింది. దేశీయ గ్రాస్ రూ.20.55 కోట్లు కాగా, ఓవర్సీస్ నుంచి మరో రూ.11 కోట్లు వచ్చాయి. దీంతో వరల్డ్‌వైడ్ ఓపెనింగ్ గ్రాస్ రూ.31.55 కోట్లకు చేరింది. ఇది ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌గా ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇక రెండో రోజు విషయానికి వస్తే.. 3,478 షోల ద్వారా రూ.6.11 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు సాధించినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఇందులో తమిళ వెర్షన్ రూ.4.56 కోట్లతో టాప్‌లో నిలవగా, తెలుగు నుంచి రూ.1.35 కోట్లు, హిందీ నుంచి రూ.20 లక్షలు వచ్చాయి. దీంతో రెండు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్లు రూ.24.21 కోట్లకు, గ్రాస్ రూ.28.21 కోట్లకు చేరాయని అంచనా వేస్తున్నారు.
కేరళలోనూ ఈ సినిమా ధనుష్‌కు భారీ ఓపెనింగ్‌ను అందించింది. తొలి రోజు అక్కడ సుమారు రూ.3.70 కోట్ల నుంచి రూ.3.80 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దాదాపు మూడు గంటల నిడివితో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో మమ్ముట్టి, ధనుష్ నటనతో పాటు మమ్ముట్టి డ్యాన్స్ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో కొంతమంది ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, నాజర్, రేణు దేశాయ్, ఇంద్రన్స్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు అందరి చూపు శని, ఆదివారాల కలెక్షన్లపైనే ఉంది. టాక్‌ను అధిగమించి వసూళ్లలో ఇదే జోరు కొనసాగిస్తే 'ఆపరేషన్ మోల్' బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
