తెలంగాణలో పాత వాహనాలకు కొత్త రూల్స్.. ఏడు రోజులే గడువు

తెలంగాణలో పాత వాహనాలకు కొత్త రూల్స్.. ఏడు రోజులే గడువు

హైదరాబాద్: తెలంగాణలో పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) అమర్చడంపై రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పాత వాహనాలకు కూడా HSRP నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. 1989 మోటారు వాహనాల చట్టంలోని రూల్ 50 ప్రకారం ఈ ప్లేట్లను అమర్చాల్సి ఉంటుందని వెల్లడించింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6,10,330 వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. వీటిలో 4,56,298 వాహనాలకు ఇప్పటికే HSRP నంబర్ ప్లేట్ల ఏర్పాటు పూర్తయింది. మరో 1,54,032 వాహనాలకు HSRP ప్లేట్లు అమర్చాల్సి ఉంది. ఈ పెండింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది.

ఇప్పటివరకు HSRP ప్లేట్లు అమర్చని వాహనాలకు సంబంధించి డీలర్లకు రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న వాహనాలకు ఏడు రోజుల్లోగా HSRP ప్లేట్లు అమర్చాలని ఆదేశించింది. నిబంధనలు పాటించని డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించింది. ఆదేశాలను పట్టించుకోని డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.