సోమరితనం ఉంటే ఓటమే.. జింక నేర్పిన జీవిత పాఠం!

సోమరితనం ఉంటే ఓటమే.. జింక నేర్పిన జీవిత పాఠం!

జీవితాన్ని ఒక లక్ష్యం కోసం  తీసుకుని పరుగెత్తేవాడు గెలుస్తాడు.

అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో మిగతా జంతువులతో పాటు ఒక జింక, ఒక సింహం ఉన్నాయి. ప్రతిరోజూ ఆ లేడి.. ‘నేను ఎవ్వరికీ చిక్కకూడదు. ఎవ్వరికీ ఆహారంగా మారకూడదు. అందుకోసం నేను వేగంగా పరుగెత్తడం అలవాటు చేసుకోవాలి. సింహం, పెద్దపులి వంటి జంతువులు నన్ను ఆహారంగా వేటాడడానికి వస్తే, వాటి నుంచి తప్పించుకోవడానికి నేను వేగంగా పరుగెత్తాలి. ఇందుకోసం నేను ప్రతిరోజూ ఉదయాన్నే లేచి సాధన చేయాలి’ అనుకుని, ఉదయాన్నే లేచి, సుమారు ఇరవై మైళ్లు వేగంగా పరుగెత్తడం సాధన చేసేది. సింహం కూడా, ‘నేను బాగా పరుగెత్తాలి. కంటికి కనబడిన జింకలను కడుపునిండా భుజించాలంటే, వాటిని వేటాడి పట్టుకోవాలి. కనుక వేగంగా పరుగెత్తడం అలవాటు చేసుకోవాలి. అందుకోసం ఉదయాన్నే లేచి, పరుగెత్తడం అలవాటు చేసుకోవాలి’ అనుకునేది. కాని, ‘నా నుంచి లేడి ఎలాగూ తప్పించుకోలేదు. కనుక నేను పరుగెత్తకపోయినా పరవాలేదులే’ అని కొంచెం అలసత్వంగా, సోమరిగా నిద్రపోతూ ఉండేది. ఒకనాడు ఉదయం జింక  కనిపించింది. అది బాగా వ్యాయామం చేస్తూండడం వల్ల బలిష్ఠంగా తయారైంది. జింకను చూడగానే సింహానికి నోరూరింది. ‘ఎలాగైనా ఈరోజు దీనిని వేటాడి పట్టుకుని తినాలి’ అనుకుని, పరుగెత్తడం ప్రారంభించింది. జింక ప్రతిరోజూ పరుగెడుతూ ఉండటం వల్ల, అలసట లేకుండా పరుగులు తీస్తోంది. సింహం సోమరితనంతో సాధన చేయకపోవడం వల్ల రెండు మైళ్లు దాటేసరికి ఇక పరుగెత్తలేకపోయింది. అలా జింక తన ప్రాణాలను తను రక్షించుకుంది. ఎంతటివారైనా అలసత్వాన్ని, సోమరితనాన్ని విడిచి, చురుకుగా ఉంటే, కార్యసాధకులు కాగలరని పెద్దలు చెబుతారు. 

కుందేలు – తాబేలు కథలో కూడా కుందేలు సోమరిగా నిద్రపోవడం వల్లే, మెల్లగా నడిచే తాబేలు విజయం సాధించింది. మన భూమి మీద చీమ అతి చిన్న ప్రాణి. ‘పిపీలికాది బ్రహ్మ పర్యంతం’ అనే నానుడి తెలిసిందే కదా. పిపీలికం అంటే చీమ. అంతటి చిన్న చీమ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం ఆహారం కోసం పనిచేస్తూనే ఉంటూనే ఉంటుంది. వానలు కురిసే సమయంలో అవి బయటకు వచ్చి, ఆహారాన్ని సంపాదించుకోలేవు కనుక, మిగతా సమయమంతా పనిచేస్తూనే ఉంటాయి. మరో విచిత్రమేమిటంటే... చీమలు తమ బరువు కంటె మూడు రెట్లు అధికంగా బరువును మోయగలవట. అవి నిరంతరం పని చేస్తూ ఉండటం వల్లే అంత శక్తిమంతంగా తయారవుతాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

క్రీడలలో పాల్గొనేవారు ఏడాదికి ఒకసారి వచ్చే పోటీల కోసం సంవత్సరమంతా కృషి చేస్తూనే ఉంటారు. పరుగు పందేలు, ఈత, జిమ్నాస్టిక్స్, కబడ్డీ... మొదలైన క్రీడలకు సాధన చాలా అవసరం. ఏమాత్రం సోమరితనంగా ఉన్నా పోటీలో అపజయంపాలు కాక తప్పదు. విజయం సాధించాలంటే సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ‘మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదువురా’ అని ఓ కవి పాట రాశారు. ‘ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన సోమరులారా చావండి’ అని శ్రీశ్రీ సోమరిపోతుల గురించి మహాప్రస్థానంలో ప్రస్తావించారు. 

సోమరితనం అంటే... పనిని ఆలస్యంగా చేయచ్చులే అనే అలసత్వం. అటువంటి వారి వల్ల కలిగే నష్టాలను, చురుకుగా ఉండటం వల్ల కలిగే లాభాలను పండితులు వివరించారు. దురాశ వల్ల మనిషి జీవించే కాలం తగ్గిపోతుంది. అసూయ వల్ల బుద్ధి మందగిస్తుంది. సోమరితనం వల్ల మనిషి జీవితంలో ఉండవలసిన సుఖసంతోషాలన్నీ నశించిపోతాయి.. అంటాడు వేమన. ఉడుము వందేళ్లు బతుకుతుంది, గబ్బిలం పాడుబడిన ప్రదేశాల్లో పడి ఉంటుంది. వాటివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అలాగే తీవ్రమైన మందబుద్ధి, సోమరిపోతు అయినవాడు బతికి ఉన్నా చనిపోయినవారితో సమానమే. వాడు సమాజానికి ఏమాత్రం ఉపయోగపడక, తన జీవితాన్ని తానే పాడుచేసుకుంటాడు అని మరో కవి చెబుతున్నాడు. 

సోమరితనాన్ని విడిచిపెట్టినవారిని విజయలక్ష్మి వరిస్తుంది. మన పెద్దలు ‘నాడు పారే చెమట బిందువు, నేడు కురిసే అమృత బిందువు‘ అన్నారు. సోమరితనం మనిషికి అతిపెద్ద శత్రువు, చురుకుదనమే అసలైన బలం అని చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణ లేదు.

డా. పురాణపండ వైజయంతి


మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
[email protected] కి మెయిల్​ చేయండి.